ప్రజలు టీడీపీని తొక్కి నారతీస్తారు

  • టీడీపీ అసలు రంగు బయటపడింది
  • హోదా సాధనలో బాబు విఫలమయ్యారు
  • ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమా బాబూ..?
  • ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా హామీలు నెరవేర్చాలి
  • వైయస్సార్సీపీ హోదా పోరాటానికి కలిసి రావాలి
  • అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్
హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై టీడీపీ అసలు రంగు బయటపడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని టీడీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. హోదాపై టీడీపీ కూస్తున్న కారుకూతలను పార్థసారధి తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం మెడలు వంచి హోదా సాధించుకుంటే యువతకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశ్యంతో ఎంపీలను రాజీనామా చేయిస్తానని ప్రకటిస్తే టీడీపీ చిత్తశుద్ది లేకుండా మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. 

హోదా కోసం ముఖ్యమంత్రి మొదటి నుంచి పోరాడుతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదు అని,  హోదాతో అన్ని జరగిపోవని మాట్లాడుతూ  టీడీపీ అసలు రంగును బయటపెట్టిందన్నారు. బాబు ఏ విధంగా హోదా కోసం ప్రయత్నం చేశారని టీడీపీని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తుంటే ముందస్తుగా అరెస్టులు చేసి అణగదొక్కేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. హోదా ప్రైవేట్‌ బిల్లును రాజ్యసభలో కాలరాయడంతో టీడీపీ కేంద్రమంత్రి సుజనా చౌదరి సంతోషంతో కేరింతలు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ వైయస్‌ఆర్‌సీపీకి హోదా గురించి పోరాడే నైతిక హక్కులేదని బురదజల్లుతున్నారని మండిపడ్డారు. 

వెంకయ్య బుద్ధి బయటపడింది
రాష్ట్ర విభజన సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం చట్టం చేసే రోజు కేంద్రానికి ఏం సూచనలు, సలహాలు చేశారో చెప్పాలన్నారు.  ఆ సూచనలతో ఏం సాధించారని ప్రశ్నించారు. హోదాను చట్టంలో నేనే పెట్టించానని చెప్పుకున్న వెంకయ్య హోదాను అగజానన స్థలాలతో పోల్చి ఆయన బుద్ధి బయటపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. విభజనపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నోరు కూడా విప్పకుండా సభ నుంచి బయటకు వెళ్లిపోయారని, అలాంటి వ్యక్తి హోదా గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నిజంగా దమ్ముంటే ఇరు పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిద్దాం... ఎన్నిలను ఎదుర్కొనేందుకు సిద్ధమా అని పార్థసారథి బాబుకు సవాల్ విసిరారు. ప్రజలు కూడా టీడీపీని తొక్కి నార తీయాలని ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు. హోదా సాధనలో విఫలమైన చంద్రబాబు కోటరీ రాజకీయాలు చేయడం తగదన్నారు. 

నేతి బీరకాయలో నెయ్యిలా ప్యాకేజీ
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్‌రావును చంద్రబాబు బలిపశువులా, పావులా వాడుకుంటున్నారని పార్థసారధి ఆరోపించారు. గుంటూరు, ఢిల్లీలో దీక్షలు చేయడం కాదు ప్రధాని ఇంటి ముందు దీక్షలు చేయమని బోండా మాట్లాడడం నిజంగా అవగాహనలేని తనం అన్నారు. ప్రధాని ఇంటి ముందు ఎవరైనా ధర్నా చేసే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష చేసి ప్రధానికి హోదాపై లేఖ ఇవ్వడం జరిగిందని సూచించారు. అనేకసార్లు ప్రధానికి హోదాపై లేఖలు ఇచ్చామన్నారు. రాష్ట్రపతికి కూడా లేఖరాసి కోరడం జరిగిందని, బోండా తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బాధ్యత గల మంత్రులతో సమాధానం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీలను, కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి నిరసన తెలపాల్సిందిపోయి అర్థరాత్రి ప్యాకేజీని స్వాగతించారని మండిపడ్డారు. నేతి బిరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ప్రత్యేక ప్యాకేజీలో కూడా ప్రత్యేకత అంతే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉంటే ఎన్నికల హామీలను నెరవేర్చి వైయస్‌ఆర్‌ సీపీ హోదా పోరాటానికి సహకరించాలని కోరారు. లేకపోతే మీ వంతుగా కేంద్రాన్ని మెప్పించి హోదా సాధించి ప్రజల ముందుకు రావాలని సూచించారు. 
 
Back to Top