కోడెల అనుచరుల వీరంగం

గుంటూరు : సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలో ఓ రైతుకు చెందిన పొలంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల కుమారుడు శివరామకృష్ణ అనుచరులు వీరంగం సృష్టించారు. వివాదాస్పద భూమికి  సంబంధించిన విషయంలో హల్చల్ చేశారు.  కోర్టు తమకు అనుకూలంగా తీర్పు చెప్పిందంటూ  50మంది వ్యక్తులు బలవంతంగా పొలం వద్దకు వెళ్లి అక్కడి పంటను ధ్వంసం చేశారు.  కోళ్లఫారం తొలగించారు. శనివారం రాత్రి  ఎర్ర మాస్కులు ధరించిన దుండగులు పొలంలోకి జొరబడి కోళ్లఫారం వద్ద నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేశారు. ఈ విషయమై ఆ భూమికి చెందిన రైతు సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తర్వాత బాధితుడితోపాటు గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఈ గొడవ సద్దమణగకముందే సోమవారం మధ్యాహ్నం మరోసారి పొలంలోకి చొరబడి పంట నాశనం చేస్తున్నారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు పొలంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా చూస్తున్నారుగానీ లోపల జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకోవడం లేదని స్థానికులు వాపోయారు. ఈ వివాదాస్పద భూమి 17 ఎకరాలు ఉంది. దీనిపై కన్నేసిన స్పీకర్ కోడెల కుమారుని అనుచరులు పోలీసుల సాయంతో భూమిని స్వాధీనం చేసుకునేందుకు  ప్రయత్నిస్తున్నారని బాధిత రైతు చెప్పారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
Back to Top