కొద్దిసేపట్లో షర్మిల పాదయాత్ర ప్రారంభం

హైదరాబాద్, 6 ఫిబ్రవరి 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ నుంచి బుధవారం పునఃప్రారంభం కానుంది. శ్రీమతి షర్మిల కొనసాగించనున్న పాదయాత్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పాల్గొననున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి వంతపాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్ర నేడు 15.5 కిలో మీటర్లు కొనసాగనుంది.
     
     'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో జరిగిన బహిరంగ సభలో బస్సుపై ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి దిగుతూ శ్రీమతి షర్మిల గాయపడ్డారు. మోకాలి గాయానికి శస్త్ర్ర చికిత్స జరిగిన తర్వాత ఏడు వారాలు విశ్రాంతి తీసుకున్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగించవచ్చని వైద్యులు తెలపడంతో బుధవారం నుంచి మళ్లీ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 2012 డిసెంబర్ 15న పాదయాత్ర ఆగిపోయిన తుర్కయాంజాల్ సమీపంలోని ఎస్ఎస్ఆర్ గార్డెన్స్ నుండి శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. తుర్కయాంజాల్, రాగన్నగూడెం, బొంగులూరు గేలు, మాన్‌సాన్‌పల్లి గేటు, శేరిగూడెం మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగి ఇబ్రహీంపటన్నం నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంటుంది. అక్కడ జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు.

Back to Top