కిరణ్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి రైతులు బలి

సత్తెనపల్లి (గుంటూరు జిల్లా) : ‘‌మన రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఇంత దారుణంగా గతంలో ఎప్పుడూ లేదు. నేను దారివెంట నడుస్తున్నప్పుడు కరెంటు రాక.. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను చూస్తుంటే చాలా బాధనిపించింది. సిఎం కిరణ్‌కుమారెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతన్నలు బలైపోతున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులను కరెంటు సంక్షోభం కోలుకోని విధంగా దెబ్బతీసింది..’ అని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో అంట‌ కాగుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. మోకాలి నొప్పి కారణంగా ఆదివారం శ్రీమతి షర్మిల 5 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేశారు. భాగ్యనగర్ కాలనీలో రచ్చబండ‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు:
కరెంటు సమస్య మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తమ్మీద ఉంది. కానీ పక్క రాష్ట్రాల వాళ్లు ముందస్తు ప్రణాళికతో విద్యుత్ కొనుగోలు చేసి సంక్షోభాన్ని అధిగమించారు.‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయనకు రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల మీద మంచి పట్టుండేది. ఏ జలాశయంలో ఎన్ని నీళ్లున్నాయి.. అవి ఎప్పటివరకు సరిపోతాయి.. ప్రాజెక్టుల నుంచి ఎంత విద్యు‌త్ ఉత్పత్తి అవుతుంది.. థర్మ‌ల్ ప్రాజెక్టు నుంచి ఎంత వస్తుంది.. వేసవిలో ఇంక ఎంత కరెంటు అవసరం అనే విషయాలు వేళ్ల మీద లెక్కించి చెప్పేవారు' శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

'ప్రస్తుత పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ ముందు చూపు లేకే ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఆయన ప్రజల సమస్యలను గాలికి వదిలేసి తన సీటును ‌కాపాడుకునే పనిలో పడ్డారు. ఈ ప్రభుత్వం ఉండి కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు. కరెంటు రెండు మూడు గంటలైనా ఉండడం లేదని రైతులు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. కరెంటు లేకపోతే ఏం? కిటికీలు, తలుపులు తీసి పడుకోండి అని అంటారు. ఆయన మాత్రం ఏసీలో ఉంటారు. ప్రజలకు ఇలాంటి ఉచిత సలహాలు పడేస్తారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించేయాల్సిన చంద్రబాబునాయుడు పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారు' అంటూ శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారంనాడు 80వ రోజు గుంటూరుజిల్లా ధూళిపాళ్ల శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు నడిచి వెన్నాదేవి సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. 80వ రోజు పాదయాత్ర ముగిసే సమయానికి శ్రీమతి షర్మిల మొత్తం 1,120.8 కిలోమీటర్లు పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నాయకులలో మర్రి రాజశేఖర్, ఆ‌ర్‌.కె., అంబటి రాంబాబు, తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, నందమూరి లక్ష్మీపార్వతి, కాపు భారతి, జ్యోతుల నవీన్, స్థానిక నాయకురాలు దేవళ్ల రేవతి తదితరులు ఉన్నారు.
Back to Top