కిరణ్‌ ప్రభుత్వం చేతలు సున్నా

పొందుగల (గుంటూరు జిల్లా), 23 ఫిబ్రవరి 2013: ఆరున్నర లక్షల కోట్లు మన రాష్ట్ట్రానికి తెస్తున్నామని, 35 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌ చెబుతున్నవన్నీ వట్టి మాటలే అని శ్రీమతి షర్మిల కొట్టి పడేశారు. 'చేతల్లో ఈ ప్రభుత్వం సున్నా' అంటూ ఆమె నిప్పులు చెరిగారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ. 10 వేలు ఇస్తున్నామంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారని, కానీ ఎవ్వరికీ ఏ రోజునా ఇచ్చింది లేదని దుయ్యబట్టారు. ఒక వేళ ఇచ్చినా 300 శాతం పెరిగిన ఎరువులు కొనేందుకు కూడా ఆ పదివేలు సరిపోవన్నారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని శ్రీమతి షర్మిల విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె శనివారం సాయంత్రం గుంటూరు జిల్లాలోని పొందుగుల గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

ఉదయించే సూర్యుడిని, జగనన్నను ఎవరూ ఆపలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు.  జగనన్నను తొమ్మిది నెలలుగా జైల్లో పెట్టి కక్ష తీర్చుకుంటున్నారని, బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. కాంగ్రెస్‌ - టిడిపి కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి కిరణ్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే కనీసం ఈ ప్రభుత్వం పరామర్శించడానికి ముందుకు రాలేదన్నారు.

అన్నదాతకు అన్ని విధాలా అన్యాయమే:
2010 -11లో వచ్చిన కరువు, నీలం తుపాను వల్ల 14 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఈ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఏమీ లేదని శ్రీమతి షర్మిల విమర్శించారు. మహానేత వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు పత్తి మద్దతు ధర రూ. 7 వేలకు కూడా పెరిగిన వైనాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఇప్పుడైతే పత్తి మద్దతు ధర రూ. 3,900 అంటున్నారని అన్నారు. అప్పటికీ ఇప్పటికీ మద్దతు ధర విషయంలో ఏమాత్రం పోలిక లేదన్నారు. మిర్చికైతే మహానేత హయాంలో రూ. 10 వేలు పలికిందని, ఇప్పుడు కేవలం రూ.5 వేలు వస్తున్నదని తెలిపారు. అప్పుడు మిర్చి ఒక ఎకరాకు 35 క్వింటాళ్ళు పండగా ఇప్పుడు కేవలం 15 క్వింటాళ్ళు మాత్రమే వస్తోందన్నారు. రైతన్న అన్ని విధాలుగా నష్టపోతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ, రాజన్న అధికారంలోకి వచ్చిన వెంటనే‌ రైతులకు రూ.13 వందల కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేశారన్నారు. ఏడు గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇస్తానన్న హామీని నెరవేర్చి చూపించారన్నారు. విత్తనాల ధరలు తగ్గించారని, ఎరువుల ధరలు పెరగనివ్వలేదని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించారని అన్నారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చారని చెప్పారు. రైతులు, మహిళలకు చంద్రబాబు రూపాయి వడ్డీకి రుణాలిస్తే మహానేత వైయస్‌ పావలా వడ్డీకే ఇచ్చారన్నారు. అన్నదాతలు రుణాల ఊబి నుంచి బయటపడాలని రూ. 12 వేల కోట్ల రుణ మాఫీ కూడా చేయించారని తెలిపారు.

పొలాలు, కిడ్నీలు అమ్ముకుంటున్న రైతులు:
కానీ, ఇప్పుడు రైతులు అప్పులు కట్టలేక పొలాలు, తమ కిడ్నీలను కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత బతికి ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఉండేవారన్నారు. ఈ ప్రభుత్వం రెండు, మూడు, నాలుగు గంటలకు మించి విద్యుత్‌ ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్‌ను కిరణ్ ప్ర‌భుత్వం ఎత్తేసినా ఆశ్చర్యం లేదన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచేసిన ఈ ప్రభుత్వం వాటిని కట్టలేని రైతుల మోటార్లు, సార్టర్లను ఎత్తుకుపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతకు ఈ ప్రభుత్వం చేస్తున్నది ద్రోహం కాదా అని శ్రీమతి షర్మిల నిలదీశారు. ఏ గ్రామంలోనూ నాలుగు గంటలకు మించి కరెంటు ఇవ్వకపోయినా రెండు, మూడు రెట్లు బిల్లులు మాత్రం వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రూ. 32 వేల కోట్లను జనం నెత్తిన అన్యాయంగా భారం మోపిందన్నారు. పరిశ్రమలకు నెలలో 12 రోజులు విద్యుత్‌ సరఫరా చేయడం లేదన్నారు. దీనిలో వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయని, లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారన్నారు.

హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లపై కేంద్రం ముందుగానే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కపెట్టిందని ఆరోపించారు. ప్రమాదాన్ని నివారించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది ఈ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలు అంటే కిరణ్‌ ప్రభుత్వానికి లెక్కే లేదన్నారు. ముందస్తు సమాచారం ఉండి కూడా ఎందుకు ఈ మారణకాండను ఆపలేకపోయారని ప్రతి పౌరుడూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు.

ఇలాంటి ప్రభుత్వం తప్పులను చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు దానితోనే అంటకాగుతున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు మరెవ్వరూ లేరన్నారు. రెండెకరాల చంద్రబాబుకు రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎక్కడ చూసినా హెరిటేజ్‌ సంస్థలు ఎలా వచ్చాయని నిలదీశారు. దేశ, విదేశాల్లో ఆయనకు ఆస్తున్నాయన్నారు. ఐఎంజీ సంస్థకు హైదరాబాద్‌లోని రూ.2,500 కోట్లు విలువైన 850 ఎకరాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేవలం నాలుగు కోట్లకే ఇచ్చేశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు నాయుడు అమ్మేశారు లేదా మూసేయించారని విమర్శించారు. ఎన్నో ప్రభుత్వ ఆస్తులను తన బినామీలకు, కావలసిన వారికి అతి తక్కువ ధరకే ఇచ్చేశారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే ఆర్టీసీ కూడా ప్రైవేటుపరం చేసేవారన్నారు.

ఒకేసారి వెయ్యి అబద్ధాలు చెప్పగల సమర్ధుడు చంద్రబాబు:
చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలిసి, తన అవినీతిపై విచారణ జరగకుండా మేనేజ్‌ చేసుకున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. చంద్రబాబు మీద కాంగ్రెస్‌ వాళ్ళు కేసులు పెట్టరని, ప్రతిఫలంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆయన అవిశ్వాసం పెట్టరని విమర్శించారు. పైపైకి ఇది తుగ్లక్ పరిపాలన అని విమర్శిస్తారన్నారు. కళ్లు ఆర్పకుండా వెయ్యి అబద్దాలు చెప్పగల సమర్థుడు చంద్రబాబు అని ఆమె ఆరోపించారు. చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నారని, ప్రాజెక్టుల కడితే నష్టం వచ్చిందని పిచ్చిలెక్కలు వేసి చూపించారని దుయ్యబట్టారు. గ్యాస్‌, ఆర్టీసీ, కరెంటు చార్జీలు పెంచిన చంద్రబాబు తన హయాంలో వేటి ధరలూ పెంచలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. ఎనిమిది సంవత్సరాల, ఎనిమిది నెలలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారని శ్రీమతి షర్మిల చెప్పారు. పెంచిన కరెంటు చార్జీలు కట్టలేని రైతులపై కేసులు పెట్టారని, ఈ విషయంలో ప్రత్యేక కోర్టులు, పోలీసు స్టేషన్లు అదే పనిగా పెట్టారన్నారు. చంద్రబాబ చేసిన అవమానాలు తట్టుకోలేక 4 వేల మంది రైతులు తమ ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

మహానేతపై చంద్రబాబు అబద్ధాలు:
కృష్ణా నీళ్ళు మన రాష్ట్రానికి రాకపోవడానికి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కారణమని నిస్సిగ్గుగా చంద్రబాబు చెబుతుండడాన్ని శ్రీమతి షర్మిల తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్రలో, కర్నాటకలో డ్యాంల ఎత్తు పెంచుకుని కట్టుకుంటుంటే, ఢిల్లీలో తానే చక్రం తిప్పుతున్నానని, తానే కింగ్‌మేకర్‌నని గొప్పలు చెప్పుకుంటూ కూడా ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదులపై పై రాష్ట్రాల వారు కడుతున్న డ్యాంలను ఆపించమని, వాటిని ఆపకపోతే మన రాష్ట్రానికి నీళ్ళు రావని, నీళ్ళు రాకపోతే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావని‌ చంద్రబాబుకు మహానేత వైయస్ హెచ్చరించినా వినలేదన్నారు. మాట మీద నిలబడడం అంటే ఏమిటో ఆయనకు ఈ జన్మలో అర్థం కాదని ఎద్దేవా చేశారు.

పేనుకు పెత్తనం ఇచ్చినట్లే!:
అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఆరు నెలల్లో గాడిలో పెడతానంటున్న చంద్రబాబు మాటలు వింటుంటే తనకు నవ్వు వస్తోందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా 'పేనుకు పెత్తనం ఇస్తే తలంగా గొరిగేసింద'న్న సామెత గుర్తుకు వస్తోందన్నారు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడో, లేక కాంగ్రెస్‌ పార్టీయో అధికారంలోకి వస్తే అంతకన్నా శాపం మరొకటి ఉండబోదన్నారు.

కాంగ్రెస్‌, టిడిపిలు ఒక్కటయ్యాయని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఈ రెండు పార్టీలు జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టాయని ఆవేద వ్యక్తం చేశారు. సిబిఐని ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. కేంద్రం చేతిలో సిబిఐ కీలుబొమ్మ అని మాజీ డైరెక్టర్‌ జోగిందర్‌ సింగ్‌ స్వయంగా చెప్పారని శ్రీమతి షర్మిల అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించినందుకే సిబిఐని జగనన్న మీద ప్రయోగించారని దుయ్యబట్టారు. ఎమ్మార్‌ భూములను కారు చౌకగా కట్టబెట్టేసినా చంద్రబాబును కనీసం విచారణకు కూడా సిబిఐ ఎందుకు పిలవడంలేదని శ్రీమతి షర్మిల నిలదీశారు. చిరంజీవి అల్లుడి ఇంటిలో 70 కోట్ల రూపాయలు దొరికితే సిబిఐకి ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు.‌ బొత్సను మించిన మద్యం మాఫియా డాన్ లేరని చెబుతున్నా సిబిఐకి వినిపించదన్నారు.

కడుపు తరుక్కుపోతోంది:
జగనన్న జనం మధ్యనే ఉంటే, రైతులు, విద్యార్థులు, చేనేత కార్మికుల కోసం నిరంతరం కృషి చేసి, వారాల తరబడి దీక్షలు, ధర్నాలు చేస్తుంటే, ప్రజల మనసుల్లో రాజశేఖరరెడ్డి సిసలైన వారసుడిగా నిలిచిపోతారని కాంగ్రెస్‌, టిడిపిలు కుట్రలు పన్నాయని, జగనన్న బయటే ఉంటే తమ దుకాణాలు మూసేసుకోవాల్సి ఉంటుందని అక్రమంగా కేసులు పెట్టాయన్నారు. జగనన్నను తలచుకున్నప్పుడల్లా కడుపు తరుక్కుపోతోందని, అమాయకుడి తీసుకువెళ్ళి జైలులో నిర్బంధించారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్వార్థం కోసం ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంటున్నారన్నారు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారని, రాజన్న రాజ్యం వైపు మనలందర్నీ నడిపిస్తారన్నారు. రాజన్న రాజ్యంలో హామీలన్నింటినీ అమలు చేస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న మహానేత ఆశయాన్ని నెరవేరుస్తారన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్నను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.
Back to Top