కిరణ్‌ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం: బాజిరెడ్డి

హైదరాబాద్, 30 మార్చి 2013 : రైతు సంక్షేమ ప్రభుత్వం తమది అని చెప్పుకునే కిరణ్‌ కుమార్‌రెడ్డి రైతన్నల పట్ల బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో 7 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను నిరాఘాటంగా సరఫరా చేస్తే ప్రస్తుత ప్రభుత్వం 4 గంటలు కూడా ఇవ్వకుండా పంటలను సర్వనాశం చేస్తున్నదని బాజిరెడ్డి దుయ్యబట్టారు. నాటి చంద్రబాబు పాలనకు నకలుగానే కిరణ్‌ కుమార్‌రెడ్డి పాలన కూడా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మాదిరిగానే కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా చేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతన్నలకు ప్రత్యేక బడ్జెట్‌ పెడతామని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో బాజిరెడ్డి గోవర్దన్‌ మాట్లాడారు.

అసెంబ్లీ సమావేశాల్లో బాధ్యత గల మంత్రులు ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా చాలా బాగుందని, వ్యవసాయానికి 7 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని, ఒకవేళ పొలాలు ఎండిపోతే దానికి కారణం బోర్లలో నీళ్ళు లేకపోవడమే అని చెప్పిన వైనాన్ని బాజిరెడ్డి గుర్తుచేశారు. ఒకవేళ నిజంగా బోర్లలో నీళ్ళుండి, విద్యుత్‌ సరఫరా చేయలేకపోతే ఒక్క సెంటు పొలమైనా ఎండిపోతే మాకు ఫోన్‌ చేయండి... మేం కాపాడతాం అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారన్నారు. విద్యుత్‌ శాఖ ఇన్‌చార్జి మంత్రిగా ఆయన సమాధానం చెప్పారన్నారు.

పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గం జనగామలోని రెండు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా ఏ విధంగా ఉందో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు బృందంగా వెళ్ళి పరిశీలించామని బాజిరెడ్డి తెలిపారు. ఆ గ్రామాల్లో పొలాలు ఎండిపోయిన రైతులతో తాము స్వయంగా మాట్లాడామన్నారు. బోర్లలో నీళ్ళున్నాయని, కరెంటు సరఫరా సరిగా లేదని ఆ రైతులు ఆవేదనతో చెప్పారన్నారు. విద్యుత్‌ సమస్య ఉంటే ఫోన్‌ చేయమని మంత్రి పొన్నాల తన నెంబర్‌ ఇచ్చారు కదా చేయమని చెప్పామన్నారు. ఒక రైతు ఫోన్‌ చేస్తే మంత్రి నుంచి సమాధానం లేదని, స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉందని బాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిండు సభలో ప్రమాణం చేసిన ఈ మంత్రి జనాన్ని ఏవిధంగా మోసం చేస్తున్నారో తేటతెల్లం అయిందని, ఇదే ప్రత్యక్ష నిదర్శనం అని విమర్శించారు. ఆ వెంటనే సిఎం కార్యాలయానికి రైతు చేత ఫోన్‌ చేయించామన్నారు. అక్కడా ఎవరూ ఫోన్‌ ఎత్తే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ అబద్ధాలే అని తేలిపోయిందని బాజిరెడ్డి గోవర్దన్‌ విమర్శించారు.
Back to Top