'కిరణ్‌ ప్రభుత్వానికి విద్యుత్‌ షాక్‌ తప్పదు'

అనంతపురం: సంవత్సరం వ్యవధిలో మూడు రెట్లు విద్యుత్‌ చార్జీలు పెంచేస్తే సామాన్యులు ఎలా బతకాలని నాయకులు, రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండే రెండు బల్బులు ఉన్న ఇళ్లకు కూడా ఐదారు వందలు బిల్లులు వస్తుంటే ఎవరికి చెప్పుకోవాలంటూ వారు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందంటూ ప్రజలు శాపనార్థాలు పెట్టారు.

విద్యుత్ చార్జీల పేరిట ప్రజలపై వేల కోట్ల‌ రూపాయల భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని ప్రజలు, రైతులు హెచ్చరించారు. ‌వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెబుతామన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనకు నిరసనగా వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం పార్టీ శ్రేణులు అనంతపురం జిల్లా వ్యాప్తంగా సబ్‌స్టేషన్లను ముట్టడించారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.‌

ఈ క్రమంలో ధర్మవరంలో వైయస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, నియోజకవర్గ‌ం నాయకుడు తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు సమీపంలోని విద్యు‌త్ స‌బ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతపురం-ధర్మవరం రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు. ఉరవకొండలో వైయస్‌ఆర్‌సిపి సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తహశీల్దా‌ర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం సబ్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతపురం పాతూరు సబ్‌స్టేషన్‌ను పార్టీ స్థానిక నాయకులు, ప్రజలు ముట్టడించారు. ఉదయం పది నుంచి రెండున్నర గంటల పాటు సబ్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫి‌క్ స్తంభించిపోయింది. ఆందోళనకారులను వ‌న్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. రాయదుర్గంలోని ట్రాన్సుకో కార్యాలయాన్ని, గుమ్మఘట్టలోని సబ్‌ స్టేషన్‌ను స్థానిక నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు.

డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురం స‌బ్‌స్టేషన్‌ను, శ్రీధ‌ర్‌గట్ట సబ్‌స్టేషన్ ఎదుట‌ పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన చేశారు. తాడిపత్రి పట్టణంలోని ట్రాన్సుకో కార్యాలయాన్ని మూడు గంటల పాటు ముట్టడించారు. సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు. పుట్టపర్తి, శింగనమల, బుక్కరాయసముద్రం సబ్‌స్టేషన్ల వద్ద ధర్నా నిర్వహించారు. హిందూపురం ట్రాన్సుకో డీఈ కార్యాలయాన్ని, సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. హంపాపురం సబ్‌స్టేషన్ ఎదుట ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు ‌వరకూ ఆందోళన చేశారు. మడకశిర ట్రాన్సుకో ఏడీఏ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గుంతకల్లులో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తరువాత ఆలూరురోడ్డులోని ఏడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

గుత్తి-గుత్తి ఆర్ఎ‌స్ మార్గంలోని డీఈ కార్యాలయం ఎదుట‌ స్థానిక వైయస్‌ఆర్‌సిపి నాయకులు, శ్రేణులు నిరసన తెలియజేశారు. కళ్యాణదుర్గం సబ్‌స్టేషన్ ఎదుట ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఆందోళన చేపట్టారు. కదిరిలోని స‌బ్‌స్టేషన్‌ను ముట్టడించిన పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పెనుకొండలో సబ్‌స్టేషన్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ముట్టడించారు.
Back to Top