కిరణ్‌ నిర్లక్ష్యం వల్లే విద్యుత్‌ సమస్య

వాడపల్లి (నల్గొండ జిల్లా), 23 ఫిబ్రవరి 2013: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఎప్పుడూ లేవని, అప్పుడు కరెంటు బాగానే ఉండేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ఆయన ఉన్నప్పుడు మన విద్యార్థులు బాగానే చదువుకున్నారన్నారు. రైతులకు 7 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సక్రమంగా సరఫరా అయ్యేదన్నారు. మహానేత బతికి ఉంటే ఇప్పుడు 9 గంటలు సరఫరా చేసేవారన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల శనివారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గంలోని వాడపల్లి వద్ద నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించారు. ముందుగా రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ సమస్యలు, అధికంగా వస్తున్న బిల్లులు, విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంటు ఇబ్బందులను శ్రీమతి షర్మిలకు వారు మొరపెట్టుకున్నారు.

మన రాష్ట్రంలో వినియోగానికి సరిపడినంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోలేం కనుక పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కోవాల్సి ఉంది. అయితే, మన ముఖ్యమంత్రి కిరణ్‌ నిద్రపోయినప్పుడు ఇతర రాష్ట్రాలు కొనేసుకున్నాయట అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొనుక్కుందమన్నా మనకు అమ్మేవారు లేరక్కడ.. అర్థమైందా అమ్మా.. అంటూ రచ్చబండకు హాజరైన మహిళలతో శ్రీమతి షర్మిల చెప్పారు. కేవలం సిఎం కిరణ్‌ నిర్లక్ష్యం వల్లే మన రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిందని దుయ్యబట్టారు. గ్రామాల్లో రోజుకు నాలుగు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా లేని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ లేని కారణంగా పరిశ్రమలకైతే నెలకు 12 రోజులు సెలవు ప్రకటించాల్సి వచ్చిందని ఆరోపించారు. విద్యార్థుల చదువుకుందామంటే కరెంటు ఉండడంలేదన్నారు. కానీ, విద్యుత్‌ బిల్లులు మాత్రం షాక్‌ కొట్టేలా వేలకు వేలు వస్తున్నాయని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు ఏనాడూ విద్యుత్‌ చార్జీలు పెంచలేదని, అలాగే గ్యాస్‌ ధరల భారం కూడా ప్రజలపై పడనివ్వలేదని గుర్తు చేశారు. ఆర్టీసీ చార్జీలు కూడా మహానేత పెంచలేదన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి సిలిండర్‌ ధర రూ.305 ఉండేదన్నారు. ఆయన సిఎంగా ఉన్నంత కాలమూ అదే ధర ఉండేదన్నారు. అంతకు ముందు చంద్రబాబు అయ్యేనాటికి రూ. 145 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ఆయన దిగిపోయేనాటికి రూ. 305కు పెంచారన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గ్యాస్‌ ధరను రెట్టింపు చేసి వదిలారన్నారు.

కాని, ఈ రోజు అదే సిలిండర్‌ ధరను రూ. 440కు పెంచేశారని, అది కూడా సంవత్సరానికి 9 సిలిండర్లే ఇస్తారట అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. సిలిండర్లు ఇంకా కావాలంటే రూ.1‌,030 పెట్టి కొనుక్కోవాల్సిన అగత్యం తెచ్చిపెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ఆర్టీసీ చార్జీలైతే రెండు, మూడు సార్లు పెంచేశారని, కరెంటు చార్జీలను నాలుగు రెట్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద 32 వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పెంచాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాబందుల రాజ్యమని, ప్రజల రక్తం పిండి వసూలు చేసిన డబ్బులతో ఖజానా నింపుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది దొంగల రాజ్యం అన్నారు.

మహానేత వైయస్‌ ఉన్నప్పుడు ఉపాధి హామీ పనులకు కూలీగా రోజుకు ఒక్కొక్కరికీ నూరు, నూట ఇరవై రూపాయలు ఇచ్చేవారన్నారు. ఇప్పుడు రూ.30 లేదా రూ. 40 ఇస్తున్నారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. దీన్నే శ్రమదోపిడీ అంటారని శ్రీమతి షర్మిల విమర్శించారు. కూలి పనులు చేసుకునే నిరుపేదలను కూడా ఈ ప్రభుత్వం దోచుకుంటున్నదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి, కిరణ్ సర్కా‌ర్కు తేడా లేదని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో 4 వేల మంది రైతులను చంద్రబాబునాయుడు పొట్టనపెట్టుకున్నారని విమర్శించారు.

పొందుగుల ఎదురుతెన్నులు :
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల రాక కోసం పొందుగుల  గ్రామం ఎదురుచూస్తోంది. మరో ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టిన ఆమె వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన పాదయాత్రను శనివారం ఉదయం నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద పునఃప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె గుంటూరు జిల్లాలో ప్రవేశించనున్నారు. పొందుగుల గ్రామం వద్ద ఆమె జిల్లాలోకి ప్రవేశిస్తారు. దీనిని పురస్కరించుకుని ఆ గ్రామ ప్రజలు షర్మిల కోసం ఎదురుచూస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు మహానేత పథకాల వల్ల తామేరకంగా లబ్ధిపొందిందీ గుర్తుచేసుకుంటున్నారు.

Back to Top