కిరణ్‌ కుమార్‌ - చంద్రబాబు ఇద్దరూ ఇద్దరే

ఆగపల్లి (రంగారెడ్డి జిల్లా), 7 ఫిబ్రవరి 2013: ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడూ ఒక్కటే అని, ఈ విషయంలో ఒకరికి ఒకరు తీసిపోరని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏనాడూ విద్యుత్‌ సంక్షోభం తలెత్తలేదని, ఒక్కసారి కూడా విద్యుత్‌ చార్జీలు పెంచలేదని ఆమె గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్నప్రజా వ్యతిరేక విధానాలకు, దానికి పరోక్షంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడి తీరుకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం మధ్యాహ్నానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆగపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆగిపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల స్థానికులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

రచ్చబండ కార్యక్రమంలో స్థానిక మహిళలు స్థానికంగా తాము ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య గురించి, ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచేసిన ‌విద్యుత్ చార్జీల గురించి, పింఛన్‌ బాధల గురించి శ్రీమతి షర్మిల ముందు ఏకరువుపెట్టారు. మహానేత మరణించాక రాష్ట్రం చీకటిలోకి వెళ్ళిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పింఛన్‌ అందడం లేదని, తనను ఎవరూ పట్టించుకోవడంలేదని అంజయ్య అనే వృద్ధుడు శ్రీమతి షర్మిలకు మొరపెట్టుకున్నాడు. అంజయ్య ఆవేదనను విన్న శ్రీమతి షర్మిల స్పందిస్తూ.. ఈ పాపం ప్రభుత్వానిదే అని, వృద్ధుని శాపం ఊరికే పోదని దుయ్యబట్టారు. శ్రీ జగన్‌ కోసం లక్షలాది కళ్ళు ఎదురుచూస్తున్నాయని అన్నారు.

స్థానికుల సమస్యలపై శ్రీమతి షర్మిల స్పందిస్తూ, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ విద్యుత్‌ సమస్యలు తలెత్తలేదన్నారు. ఒక్కసారి కూడా విద్యుత్‌ చార్జీలను ఆయన పెంచలేదన్నారు. తొలిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన వ్యవసాయానికి 7 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రెండవసారి సి.ఎం. అయినప్పుడు ఆ మహానేత ఉచిత విద్యుత్‌ సరఫరాను 9 గంటలకు పెంచినట్లు పేర్కొన్నారు. రైతులకు రూ. 12 వేల కోట్ల రుణాలను డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మాఫీ చేయించారని తెలిపారు.

అయితే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిన వైనాన్ని పేర్కొన్నారు. కాగా, మహానేత వైయస్‌ మరణం తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంత దారుణమైన విద్యుత్‌ సమస్య తలెత్తిందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.

వైయస్‌ఆర్‌ జీవించి ఉంటే ఇబ్రహీంపట్నం చెరువును కృష్ణానది నీటితో నింపి, పంటలకు సాగునీటిని సరఫరా చేసి ఉండేవారని శ్రీమతి షర్మిల అన్నారు. త్వరలోనే జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వస్తుందని, మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయని భరోసా ఇచ్చారు. జగనన్న ఆధ్వర్యంలో రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని చెప్పారు.
Back to Top