తప్పించుకునేందుకే మహానేతపై సీఎం 'విభజన' నిందలు

హైదరాబాద్ 09 ఆగస్టు 2013:

తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌పై ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి నిందలు వేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఆరోపించారు.  విభజనకు డాక్టర్ వైయస్‌ఆరే  బీజం వేశారంటూ సీఎం మాట్లాడటం దారుణమన్నారు. ఒకవేళ ఆయన విభజన చేయాలనుకుంటే .. ఆ పని ఎప్పుడో చేసేవారని పేర్కొన్నారు. డాక్టర్ వైయస్‌ఆర్‌లాంటి బలమైన నాయకుని వల్లే విభజన జరగలేదన్న విషయం ప్రతి సామాన్యుడికి తెలుసునని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆమె మీడియా సమావేశంలో ప్రసంగించారు. విభజన ప్రకటనకు  ముందే ముఖ్యమంత్రి స్పందించి ఉంటే బాగుండేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని  ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించివుంటే పార్టీ నిర్ణయం తీసుకునేదా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి ముఖ్యమంత్రి వైఖరే కారణమని స్పష్టంచేశారు.

హైపవర్ కమిటీ ప్రభుత్వ కమిటీనా..కాంగ్రెస్ కమిటీనా?
ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటయిన నలుగురు సభ్యుల కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీనా, ప్రభుత్వ కమిటీనా  అనేది కేంద్రం స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ అధికారికంగా ప్రకటించారు కాబట్టే అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను ఆ కమిటీకి చెప్పాయని గుర్తు చేశారు. ఏకే ఆంటోనీ కమిటీ ప్రభుత్వ కమిటీ అయితే అన్ని పార్టీలు తమ వైఖరి స్పష్టం చేస్తాయన్నారు.  

సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చెప్పినట్లు ఆడుతున్నారని శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుని పోతోందని భావించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విభజనపై సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన పది రోజుల తరవాత బయటకొచ్చి చేసిన వ్యాఖ్యలు సామాన్యుడిని తలపిస్తున్నాయని చెప్పారు. ఓ సామాన్యుడు ముఖ్యమంత్రిని అడగాలనుకుంటున్న సమస్యలు ఆయన నోటివెంట రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగారు అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు రోడ్డెక్కి దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. సమస్యలకు బదులివ్వాల్సిన ముఖ్యమంత్రి పదిరోజుల తర్వాత బయటకొచ్చి విభజిస్తే ఈ సమస్యలుంటాయనీ, అవి తీరేంతవరకూ విభజించడానికి వీల్లదనీ చెప్పారనీ.. ఇది విన్న తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రా, మరో పార్టీకి చెందిన ముఖ్యమంత్రా అనే సందేహం కలిగిందన్నారు. మీకు సంబంధం లేకుండానే సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేసిందని చెప్పచ్చు కదా అని  ప్రశ్నించారు. మీ వాదనను కోర్ కమిటీ, సీడబ్ల్యూసీల ముందు ఎందుకు వినిపించలేకపోయారన్నారు. ఒకవేళ మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకుని ఉంటే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పి ,మీకు గౌరవం లేని పార్టీ నుంచి రాజీనామా చేసి వచ్చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నారని తెలిసి బీజేపీ లోక్ సభ పక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ రాష్ట్ర అధ్యక్షుడికి ఫోను చేసి చెప్పారనీ, ముఖ్యమంత్రిగా ఉన్న మీకు తెలియకుండా నిర్ణయం ఎలా జరుగుతుందని నిలదీశారు.

విభజనకు బీజం వేసింది దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారేనని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమన్నారు. నాలుగేళ్ళ క్రితం దిగ్విజయ్ సింగ్ కూడా ఇలాగే అన్నారన్నారు. అదే నిజమైతే రాష్ట్ర విభజన ఎప్పుడో జరిగుండేదని చెప్పారు. మహానేత చనిపోయిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటైందని చేసిన ప్రకటన గుర్తులేదా అని ప్రశ్నించారు. ఆయన జీవించి ఉండగా విభజన అంశాన్ని ప్రస్తావించే ధైర్యాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వారుచేయలేకపోయిన విషయం మరిచారా అని అడిగారు.

మహానేత లేఖ ఇచ్చి ఉంటే మీరెందుకు అడ్డుకోలేదు

'2000 సంవత్సరంలో చిన్నారెడ్డిగారి ఆధ్యర్యంలో సోనియా గాంధీగారికి వైయస్ఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కావాలని లేఖ ఇచ్చారని చెబతున్నారు. సీఎల్పీ సభ్యులుగా ఉన్న మీరు దీనిని ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదో'  చెప్పాలని సీఎంను శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ  సలహాలను తానే ఇచ్చానని కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారన్నారు. అవి కాంగ్రెస్ పార్టీ పథకాలని కూడా ఆయన ముక్తాయిస్తున్నారన్నారు. ఇన్ని చెబుతున్న మీరు తెలంగాణ అంశం వచ్చేసరికి దానికి బీజం వేసింది వైయస్ఆర్ గారే బీజం వేశారని చెప్పడం ఎంతవరకూ సమంజసమన్నారు.  మహానేత వల్లనే రాష్ట్రం సమైక్యంగా ఉందనే విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసన్నారు. బలహీనమైన, చేతగానీ ముఖ్యమంత్రుల వల్లనే రాష్ట్రానికి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.  మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడ్డారని ఆమె చెప్పారు. 2009లో ముఖ్యమంత్రయిన తర్వాత అసెంబ్లీలో రాజశేఖరరెడ్డిగారు ఈటెల రాజేందర్‌తో అన్న 'తెలంగాణ నినాదంతో మీరు.. అభివృద్ధి నినాదంతో నేను ఎన్నికలకు వెళ్లాం. మీకంటే నేనే తెలంగాణలో ఎక్కువ సీట్లు తెచ్చున్నానని'  చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మలేదని కూడా చెప్పారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ డాక్టర్ రాజశేఖరరెడ్డిగారి మరణించిన వెంటనే మాట్లాడుతూ, తెలంగాణకు పెద్ద అడ్డంకి తొలగిపోయిందని మాట్లాడిన అంశాన్ని కూడా ఆమె గుర్తుచేశారు.

ప్రజా ప్రస్థానాన్ని చిన్నారెడ్డి ఎందుకు అడ్డుకుంటారు?

తెలంగాణకు అనుకూలంగా మహానేత లేఖ ఇప్పించి ఉంటే పత్రికలు గగ్గోలు పెట్టేవనీ, ఆ అంశం ఏ పత్రికలోనూ రాలేదని ఆమె చెప్పారు. ఆయనంటే వ్యతిరేకత ఉన్న పత్రికలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. సోనియాగాంధీని కలిసిన వారిలో కోట్ల విజయభాస్కరరెడ్డి, అప్పటి పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణరావులతో పాటు రాజశేఖరరెడ్డిగారున్నారనీ, వారందరూ ఉండగా చిన్నారెడ్డిగారు వచ్చి లేఖ ఇచ్చారనీ చెబుతూ దీనర్థం ఆయన ఇప్పించినట్లా.. అదే నిజమైతే లేఖపై మహానేత సంతకం ఉందా అని ప్రశ్నించారు. ఆయన సంతకమే పెట్టి ఉంటే చిన్నారెడ్డిగారు వైయస్ఆర్ గో బ్యాక్ అంటూ 2003లో పాదయాత్ర చేపట్టినప్పుడు ఆయనను ఎందుకు అడ్డుకుంటారని అడిగారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడమే ముఖ్యమంత్రి మహానేతమీద నిందవేస్తున్నారని ప్రజలు గమనించారనీ, ఆయనకు తగిన బుద్ధి చెబుతారనీ తెలిపారు.

ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు తమతమ పాత్రలను కాకుండా ఎదుటివారి పాత్రలను పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణపై నిర్ణయం వచ్చిన వెంటనే చంద్రబాబు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మరో రాజధానికి నాలుగైదు లక్షల రూపాయలివ్వండని అడిగారు. అదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమస్యలు తీర్చకుండా విభజన కుదరదని చెప్పారన్నారు. ఇదే మాటలు నిర్ణయానికి ముందు మాట్లాడి ఉంటే విభజన ఆగి ఉండేదన్నారు. ఆయన ఈ సందర్భంలో ప్రతిపక్షనాయకుడిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. రెండు పార్టీలకూ ప్రజలు తప్పకుండా బుద్ధిచెబుతారన్నారు.

విభజించి, పాలించిన బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన క్విట్ ఇండియా దినోత్సవం ఈరోజని శోభానాగిరెడ్డి చెప్పారు. ప్రస్తుతం తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీ విభజించి పాలిస్తోందనీ, దానిని తరిమికొట్టాలనీ ఆమె పిలుపునిచ్చారు. క్విట్ కాంగ్రెస్, క్విట్ టీడీపీ సూత్రాన్ని ప్రజలు పాటిస్తారన్నారు. రెండు ప్రాంతాలకూ సమన్యాయం జరగాలని, లేకుంటే అడ్డుకుంటామనీ మా పార్టీ కేంద్ర హోం మంత్రికి రాసిన లేఖలో పేర్కొందన్నారు. సాగునీరు, విద్యుత్తు, సమస్యలు తీర్చాలని కోరారన్నారు. ఆ లేఖలో తాము ప్రస్తావించిన సమస్యలనే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఎద్దేవా చేశారు.

Back to Top