సోనియాకు బాబు, కిరణ్ దాసోహం

పీలేరు (చిత్తూరు జిల్లా):

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియాగాంధీ అహంకారానికి దాసోహమైపోయారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. అందుకే అడ్డగోలుగా, వడివడిగా జరుగుతున్న విభజన ప్రక్రియకు వారిద్దరూ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి గురువారంనాడు చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని సదుం మండల కేంద్రం, పీలేరు, కల్లూరు, మాదలచెరువుల్లో జరిగిన భారీ బహిరంగ సభలలో ప్రసంగించారు. ముసాయిదా బిల్లుపై చర్చించడమంటే కేంద్రం ఇస్టానుసారంగా చేస్తున్న విభజనకు మద్దతు ఇచ్చినట్లే అన్నారు. అన్ని సంప్రదాయాలను, ప్రజాస్వామ్య విధానాలనూ విడిచిపెట్టి రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన విమర్శించారు.

అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ బిల్లు మనకు పంపించిందని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. బిల్లుపైన చర్చ జరిగితే విభజన చేయడానికి కేంద్రానికి అనుమతిచ్చినట్టే అవుతుందన్నారు. అందుకే చర్చ వద్దని వైయస్ఆర్ కాంగ్రె‌స్ గట్టిగా పట్టుపడుతోందన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు ‌కుమ్మక్కై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీదే తప్పని వేలెత్తి చూపించే సిగ్గుమాలిన పనికి ప్రయత్నిస్తున్నార‌ని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకే వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ‌ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ గడ్డ మీద పుట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకూ సిగ్గు ఏమైనా ఉందా? అని నిలదీశారు.

చర్చ పేరుతో పట్టపగలే మోసం :
ఇంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సభలో ఆ మోసగాళ్ళిద్దు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి కనపడరని శ్రీ వైయస్‌ జగన్‌ విమర్శించారు. దేశ చరిత్రలో ఇంత అన్యాయం ఎక్కడా జరగలేదేమో అని అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే అనిపిస్తోందన్నారు.

విభజన వద్దని రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు, అత్యధిక శాతం మంది శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారని శ్రీ జగన్‌ అన్నారు. కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం ఎలాంటి తీర్మానం లేకుండా బిల్లును అసెంబ్లీకి పంపి ఇక విభజన అయిపోయింది, చర్చించుకోండి అని చెబుతోందని విమర్శించారు. ఇలాంటి అన్యాయం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నిరాహార దీక్షలు చేసింది. పార్టీ మొత్తం ఒక్కతాటి మీద నిలబడి, రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి అఫిడవిట్లు ఇచ్చి సమైక్యాంధ్ర కోసం నిలబడింది. చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే అని, ఓటింగ్ జరపండి అని పట్టుబట్టిన వై‌యస్ఆర్‌సీపీ శాసనసభ్యులను ప్రభుత్వం సభ నుంచి సస్పెండ్ చేయించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సోనియా గాంధీ దూతగా కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ మన రాష్ట్రానికి వచ్చారని, చంద్రబాబు, కిర‌ణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి వైయస్ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించి చర్చ జరిగేలా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దిక్కుమాలిన రాజకీయాలు, రాక్షస పాలన అంతమయ్యే రోజులు త్వరలోనే వస్తాయని శ్రీ జగన్‌ హెచ్చరించారు. రాష్ట్రాన్ని విభజించే కుట్రలో సీఎం కిరణ్, చంద్రబాబు నాయుడు చేతులు కలిపారని ఆయన దుయ్యబట్టారు. ఆజాద్‌ వచ్చిన వెంటనే వాళ్ళిద్దరూ విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేశారని ఆరోపించారు. ఇలాంటి దిగజారుడు, స్వార్థపూరిత రాజకీయాలను అవలంబిస్తున్నారని శ్రీ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

విభజన కోసం చర్చ ఎందుకు? :
రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి అసెంబ్లీలో చర్చ ఎందుకని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలందరినీ ఒక్కరోజు అసెంబ్లీకి పిలిచి రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా అని అడగండని ఆయన సూచించారు. ఎమ్మెల్యే చెప్పిన దాన్ని తీర్మానంగా చేయండని అన్నారు.

సమైక్యం కోసం మీరేం చేశారు? :
‘మన రాష్ట్రాన్ని విభజించకూడదని ఏ రోజైనా మీరు నిరాహార దీక్ష చేశారా? అని కాంగ్రెస్, టీడీపీ నాయకులను శ్రీ జగన్‌ నిలదీశారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని వారు ఎప్పుడైనా రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చారా? అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కనీసం ఒక్క లేఖైనా ఇచ్చారా? అని అడిగారు. వీళ్లంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి సిద్ధమయ్యారు. మీరు చేస్తున్న మోసాలను పై నుంచి దేవుడు చూస్తున్నాడని శ్రీ జగన్‌ అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం ఒక్కటై ఉప్పెనలా ఉద్యమిద్దామని ప్రజలకు శ్రీ వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజించాలని ఉబలాటపడుతున్న సోనియాగాంధీ, ఆమె గీచిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు ఆ ఉప్పెనలో కొట్టుకుపోతారన్నారు. వీళ్లంతా ఎన్ని కుట్రలు పన్నినా నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయన్నారు. ఆ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయన్నారు. వాటిలో మనందరం ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం అని పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top