వైయ‌స్ జగన్‌ను భారతిని చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది

 
అలంపూర్‌ : ‘వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు  వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డి–భారతి దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది.. అపుడే నాకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్‌ పేర్కొన్నారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడా లని తన కోరిక అని ఆయన చెప్పిన నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్‌.. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శనివారం రాజోళికి వచ్చి విద్యాసాగర్‌ను ఆయన నివాసం లో పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ మాట్లాడుతూ తనకు, తన తల్లిదండ్రులకు వైయ‌స్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబమంటే ప్రాణమని.. ఎప్పటికైనా పెద్దాయనను కలవాలని అనుకున్నా కుదరలేదని పేర్కొన్నారు.

ఆ తర్వాత వైయ‌స్ జగన్‌ చూసినపుడల్లా కలవాలని, మాట్లాడాలని అనిపించినా కుదరడం లేదని తెలిపారు. సివిల్‌ ఇంజనీర్‌గా ఎన్నో ప్రాజెక్టుల్లో సేవలందించిన తనకు ఎక్కడా సరైన గౌరవం దక్కకపోగా.. వైయ‌స్‌ కుటుంబాన్ని చూడగానే తెలియని ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. అయితే, పని చేసే సమయంలోనే నా రెండు కిడ్నీలు చెడిపోగా, అల్సర్‌ కూడా వచ్చిందని.. ఇంతలోనే తన కూతురు కూడా చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె కూడా వైయ‌స్ జగన్‌ను చూడాలని కోరుకునేదని.. ఆమె కోరిక తీరకపోగా, తన కోరికైనా తీరుతుందో, లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాను వైయ‌స్ జగన్‌ చూడాలనుకుంటున్న విషయం తెలుసుకుని ఆయన తరఫున శ్రీకాం త్‌రెడ్డిని పంపించడం ఆనందంగా ఉందని విద్యాసాగర్‌ తెలిపారు. ఇంత త్వరగా స్పందించే గుణం ఉండడంతోనే వైయ‌స్ఆర్‌ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, అందుకే జననేతగా పిలుస్తున్నారని తెలిపారు.
 
విద్యాసాగర్‌కు అండగా ఉంటాం.. 
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటా మని గట్టు శ్రీకాంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేలా సమస్య తెలుసుకునేందుకు తనను జగన్‌మోహన్‌రెడ్డి పంపించారని తెలిపారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర నాయకులు కొండూరు చంద్రశేఖర్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, బీస మరియమ్మతో పాటు భూపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, చంద్రవాసులు రెడ్డి, బంగారు మహేశ్వర్‌ రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రాజు, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
 


 

Back to Top