ఖమ్మం సభ 'విజయ'వంతం

ఖమ్మం 20 నవంబర్ 2012 : అంచనాలకు మించి జనం హాజరైన ఖమ్మం సభ విజయవంతం కావడం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులను మరింత పటిష్ఠం చేసింది. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు జలగం వెంకటరావు వైయస్ఆర్ సీపీలో చేరిన సందర్భంగా సోమవారం సాయంత్రం ఖమ్మంలో జరిగిన విజయమ్మ బహిరంగసభకు జనం పోటెత్తారు. జలగం అనుచరులతో పాటు వివిధ పార్టీలకు రాజీనామా చేసిన పలువురు వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. జిల్లా నలుమూలల నుండి జనం ఈ సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. అన్ని దారులూ ఖమ్మంకేసే దారితీశాయి. తరలివచ్చిన జనసందోహంతో పురవీధులు నిండిపోయాయి. సభా ప్రాంగణం పెవిలియన్‌గ్రౌండ్ ఇసుకేస్తే రాలని రీతిలో కిటకిటలాడింది. 'జై జగన్...జై జై జగన్, వైయస్ఆర్ అమర్ హై.. వెంగళరావు అమర్ హై' అన్న నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. కాలువొడ్డు,  ఇల్లెందు క్రాస్‌రోడ్డు, వైరా రోడ్డు, బైపాస్‌రోడ్ల మీదుగా సభా ప్రాంగణానికి తరలివెళ్తూ వైయస్ఆర్ సీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. గిరిజన సంప్రదాయ నృత్యాలతో, పాటలతో ఖమ్మం మార్మోగింది. మధ్యాహ్నం నుంచే జనం ఖమ్మం పట్టణానికి చేరుకోవడంతో ఎక్కడ చూసినా వైయస్ఆర్ సీపీ సందడే అగుపించింది. సాయంత్రం ఆరుగంటలకు బహిరంగ సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసి పోవడంతో సభ లోపలికి వెళ్లలేనివారితో మయూరిసెంటర్, భక్తరామదాసు కళాక్షేత్రం, పరిసరప్రాంతాలు కిటకిటలాడాయి. బహిరంగసభకు వైయస్ఆర్ సీపీ కేంద్రకమిటీ సభ్యులతోపాటు రాష్ట్ర నాయకులు, పలువురు జిల్లా నాయకులు హాజరయ్యారు.
నిప్పులు చెరిగిన విజయమ్మ...
అరగంట పాటు సాగిన వైయస్.విజయమ్మ ప్రసంగం సభకు హైలైట్. విజయమ్మ చంద్రబాబుపై పదునైన మాటలతో విరుచుపడ్డారు. ఆమె ప్రతిమాటకూ సభలోని జనం చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తే ఉత్సాహంగా స్పందించారు.
ఆమె ప్రసంగం ఉత్తేజభరితంగా సాగింది. ఆమె ప్రసంగిస్తున్నంత సేపూ ఆకాశంలో మిరుమిట్లు గొల్పే బాణసంచా కాల్చారు. కాగా యువకులు ఒక్కసారిగా విజయమ్మను చూసేందుకు సభా వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో ఆమె రెండు సార్లు వేదికపై కలియతిరుగుతూ అందరికీ అభివాదం చేశారు. నల్లగొండ జిల్లా కోదాడ, సూర్యాపేట, వరంగల్ జిల్లా మహబూబాబాద్, నర్సంపేట, కృష్ణా జిల్లా తిరువూరు, నూజివీడు నుంచి జగన్ అభిమానులు, వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు ఈ బహిరంగసభకు తరలివచ్చారు.
విజయమ్మకు ఘనస్వాగతం...
ఖమ్మంజిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద హైదరాబాద్ నుండి వస్తున్న విజయమ్మకు కూసుమంచి మండల పార్టీ నాయకులు, లంబాడి మహిళలు సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఖమ్మం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్న విజయమ్మను జిల్లా నేతలు ఆహ్వానించారు. ఆరు గంటలకు విజయమ్మ జలగం వెంకట్రావుతో  వేదికపైకి వచ్చారు.
గతంలో ఏపార్టీలోనూ లేని విధంగా ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలోనే 20 వేల కుటుంబాలు విజయమ్మ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జలగం వెంకట్రావు ప్రకటించారు. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి వేలాది కుటుంబాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాయన్నారు. మహానేత వైయస్ సతీమణిని చూడడానికి మహిళలు సైతం వేలాది మంది తరలివచ్చారు. వైయస్ఆర్ సీపీలో చేరిన వారిలో పలు పార్టీలకు చెందిన మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనాయకులున్నారు.
ఊర్రూతలూగించిన వంగపండు ఉష :
బహిరంగ సభ ప్రారంభానికి ముందు వైయస్ఆర్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. మహానేత సంక్షేమ పథకాలు, అనంతరం రాష్ట్రంలో సాగుతున్న పాలన గురించి వివరిస్తూ ఆమె పాటలు పాడారు. సీబీఐ వేధింపులు జగన్‌ను అడ్డుకోలేవని, జైలు గోడలను బద్దలు కొట్టుకుని జగన్ బయటకు వస్తాడని ఉష పాడిన పాటతో అక్కడున్న వారు కేరింతలు కొట్టారు. ప్రజాభిమానాన్ని జైలు గోడలతో బంధించలేరని ఆమె అన్నారు.
జలగం వెంకట్రావ్ చేరిక సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉరకలు వేస్తోంది.అన్ని నియోజకవర్గాల నుంచి వేలాది తరలిరావడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఉన్న బలం ఏమిటో వెల్లడి అయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీకి ఇది తొలి సభ కావడం, దానికి రాష్ట్రస్థాయి నేతలంతా హాజరు కావడం విశే్షం.
ఈ సభలో వైయస్ఆర్ సీపీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావు, బాజిరెడ్డి గోవర్ధ
న్, పార్టీ అధికార ప్రతినిధి గట్టు రాంచంద్రరావు, జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్, ఐదు జిల్లాల కోఆర్డినేటర్ జిట్టా బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర నేతలు జనక్‌ప్రసాద్, చందా లింగయ్య, బానోత్ మదన్‌లాల్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ రావు, కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయబాను, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, మేక ప్రతాప్ అప్పారావు, రవీంద్రనాయక్, లక్ష్మీరెడ్డి, బానోత్ పద్మావతి, చాగంటి రవీంద్రారెడ్డి, చాగంటి వసంత, జిల్లా నేతలు రామసహాయం నరేష్‌రెడ్డి, మచ్చా శ్రీనివాసరావు, సాదు రమేష్‌రెడ్డి, నంబూరి రామలింగేశ్వరరావు, గొల్లపూడి రాంప్రసాద్, తోట రామారావు, మందడపు వెంకటేశ్వరరావు, మెండెం జయరాజు, నిరంజన్‌రెడ్డి, ఎడవల్లి కృష్ణ, భూక్యా దళ్‌సింగ్, అయిలూరి మహేష్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, రవీందర్‌రెడ్డితో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు హాజరయ్యారు.
వైయస్ఆర్ సీపీలోకి...
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుతోపాటు ఆయన అనుచరులు, మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఆయనతో పాటు వైరా మాజీ సర్పంచ్ బొర్రా వెంకటేశ్వర్లు, బొర్రా రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ సూతకాని జైపాల్, కాంపాటి శేషగిరి, మాదినేని లక్ష్మణ్, మిట్టపల్లి నాగి, సీతారాములు, దార్న రాజశేఖర్, సత్తుపల్లి నగర పంచాయతీ మాజీ చైర్‌పర్సన్ పూచి యశోద, మాజీ వైస్ చైర్‌పర్సన్ అమరవరపు విజయనిర్మల, మాజీ జడ్‌పీటీసీలు బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, సుజాతరావు, బేతి సాంబశివరావు, వంకా కరుణమ్మ, గొల్లమందల సుజాత, మాజీ ఎంపీపీ చెక్కిలాల విజయలక్ష్మి, సత్తుపల్లి నగర పంచాయతీ మాజీ కౌన్సిలర్లు నాగళ్ల ప్రసాదరావు, వేములపల్లి మధు, దాసరి వెంకటేశ్వరరెడ్డి, దేవళ్ల పెద్దిరాజు, జగన్నాధం రాములు, బాదరవాడ వేణు, ఎస్‌కె.జరీనా, ఎండి.షరీఫుద్దీన్, ఇనపనూరి జయరాజు, మాజీ ఎంపీటీసీలు నల్లపు లీలాప్రసాద్, మట్టా ప్రసాద్ తదితరులు కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Back to Top