వైయస్ఆర్‌ జనభేరిని అడ్డుకుంటే కఠిన చర్యలు

ఖమ్మం: 

ఖమ్మంలో బుధవారంనాడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే ‘వైయస్ఆర్‌ జనభేరి’ బహిరంగసభను అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులుంటాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పార్టీలు వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, జేఏసీ నేతలతో రంగనాథ్‌ సోమవారంనాడు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ‌.. శ్రీ జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు అనుమతి కోసం ఆ పార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అందుకు పోలీసు శాఖ కూడా అనుమతి ఇచ్చిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో జిల్లాలో జరిగే మునిసిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్పీ కోరారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకే ఎన్నికలు జరుగుతున్నప్పటికీ జిల్లా మొత్తం ఎన్నికల కో‌డ్ వర్తిస్తుందని వెల్లడించారు.

Back to Top