వైయస్‌ జగన్‌ను కలిసిన ‘కేశవరెడ్డి’ బాధితులు

 

చిత్తూరు: కేశవరెడ్డి విద్యా సంస్థల బాధితులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం చిత్తూరు జిల్లా కంబళ్లపల్లి నియోజకవర్గం బోరెడ్డివారిపల్లె గ్రామంలో బాధిత కుటుంబాలు వైయస్‌ జగన్‌కు తమ బాధలు చెప్పుకున్నారు.  పిల్లలు చదువుకునేందుకు అప్పులు చేసి కేశవరెడ్డి స్కూల్‌లో డిపాజిట్‌ రూ.2.75 లక్షలు చేయించుకున్నారని, ఇంతవరకు ఆ డబ్బు  తిరిగి ఇవ్వలేదని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు అడిగితే సమాధానం చెప్పే నాథుడు లేడని, తమ పిల్లలను ఎలా చదివించుకోవాలో దిక్కు తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌జగన్‌ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు:
డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని కొత్తపల్లి గ్రామానికి చెందిన మహిళలు వైయస్‌ జగన్‌కు తెలిపారు.  ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇంతవరకు రుణాలు మాఫీ చేయలేదని, రెండు రూపాయల వడ్డీ బ్యాంకు అధికారులు కట్టించుకుంటున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. మూడు విడతలుగా వడ్డీ డబ్బులు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ మన ప్రభుత్వం వచ్చాక నాలుగు విడతల్లో రుణాలు మాఫీ చేసి మీ చేతికే డబ్బులు ఇస్తానని, వడ్డీ లెక్కలు కూడా బ్యాంకుకు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.
 
Back to Top