కర్నూలు ఫ్యాక్షన్‌ రాజకీయాలకు కేరాఫ్‌ కేఈ

నంద్యాల: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్తిపాడు సమన్వయకర్త దివంగత నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి మండిపడ్డారు. నంద్యాలలో విలేకరుల సమావేశంలో రోజాతో కలిసి ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు గత 9 సంవత్సరాల పాలనలో కూడా ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని గుర్తు చేశారు. నిధులు లేవని మాటలు చెప్పే ముఖ్యమంత్రి నంద్యాలను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మోసకారి చంద్రబాబు ప్రభుత్వానికి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. 

కర్నూలు జిల్లాలో హత్యా రాజకీయాలు చేసేది ఎవరో అందరికీ తెలుసని, కేఈ కుటుంబం ఎక్కడ ఉంటే అక్కడ ఫ్యాక్షన్‌ పెరిగిపోతుందన్నారు. తన కొడుకును పైకి తీసుకురావడం కోసం కేఈ ప్రజాధరణ కలిగిన నారాయణరెడ్డిని హతమార్చారని ఫైరయ్యారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ తగ్గించాలనే ఆలోచనతో గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరెడ్డి పాలన చేశారని, అదే విధంగా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ కూడా అదే మార్గంలో నడుస్తున్నారన్నారు. నంద్యాలలో గత 20 రోజులుగా ప్రచారం చేస్తున్నానని, ఏ గడపకు వెళ్లినా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని చెప్పారు. నంద్యాలలో వైయస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
Back to Top