అబద్దాలు చెప్పడంలో కేసీఆర్‌ ఘనత

మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్న టీఆర్‌ఎస్‌
డుప్లికేట్‌ కమిటీతో అశాస్త్రీయంగా జిల్లాల విభజన
ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని సర్కార్‌
జిల్లాల విభజనలో లోపాలు, లొసుగులు
వైయస్‌ఆర్‌ను చూసి పరిపాలన చేయడం నేర్చుకోండి
వైయస్‌ఆర్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్‌

హైదరాబాద్‌: అబద్దాలు ఆడడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావును మించినవారు ఎవరూ లేరని, అబద్దాలు ఆడే సీఎంగా చరిత్రలో నిలిచిపోతాడని వైయసార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్‌ విమర్శించారు. మాటల గారడీతో రాష్ట్ర ప్రజలను  గందరగోళంలో పడేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ చేస్తున్న జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందని శివకుమార్‌ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుడు ముఖ్యమంత్రి నుంచి జిల్లాల ప్రక్రియ వరకు కేసీఆర్‌ వన్నీ అబద్దాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అవతరణ సమయంలో నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితుడిని నియమిస్తానని చెప్పి మాట తప్పారని పేర్కొన్నారు.  ఎన్నికల మ్యానిఫెస్టోలో అనేక అంశాలను నెరవేర్చకుండా అబద్దాలతో మూడు దసరాలుగా కాలం వెల్లదీస్తున్నాడని ఎద్దేవా చేశారు. అధికారం కోసమే తప్ప కేసీఆర్‌ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీలేదని మండిపడ్డారు. 
టీఆర్‌ఎస్‌ నేతల కోసమే జిల్లాల విభజన
జిల్లాల పునర్విభజనపై డ్రాఫ్ట్‌ నోటీఫికేషన్‌ ముందు 24 జిల్లాలని చెప్పి ఆ తరువాత 27 జిల్లాలని చెప్పి చివరకు ఒక డూపికేట్‌ కమిటీని ఏర్పాటు చేశారని శివకుమార్‌ ధ్వజమెత్తారు. ఆ కమిటీకి కేకే కమిటీ అని పేరు పెట్టారని దుయ్యబట్టారు.  జిల్లాల పునర్విభజనలో చట్టబద్ధత ఎక్కడుందని శివకుమార్‌ కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆగస్టులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నెలరోజులు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది, ప్రజల ఆకాంక్షల మేరకే జిల్లాల విభజన ఉంటుందని చెప్పి గొప్పలు చెప్పుకొని ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రజల లక్షల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోకుండా టీఆర్‌ఎస్‌ నేతలతో క్యాంపు కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దసరా పండుగ అంటూ హడావిడి చేస్తున్నారని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలోచించాల్సిన పద్దతి ఇదేనా అని కేసీఆర్‌ను నిలదీశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారి ఫిర్యాదులను కులంకుషంగా పరిశీలించి విభజన జరపాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల కోసం జిల్లాల విభజన జరుపుతున్నారు తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.
రైతుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి
రెవెన్యూ డివిజన్‌ పరిధికంటే తక్కువ ఉన్న ప్రాంతాన్ని కూడా కలెక్టరేట్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధతలేని నలుగురితో కమిటీ వేసి తూతూ మంత్రంగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల ప్రక్రియలో లోపాలు, లొసుగులు ఉన్నాయి కాబట్టి తొందర పడాల్సిన అవసరం లేదని క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంకో రెండు రోజుల్లో జిల్లాల ఏర్పాటు పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు ఐఏఎస్‌ అధికారులను ఎలా పంపించారని ప్రశ్నించారు. వాళ్లు తిరిగి వచ్చి జిల్లాల ఏర్పాటులో ప్లస్‌లు, మైనస్‌లు చెబితే అప్పుడేం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. సెంటిమెంట్లతో కాకుండా మెదడు ఉపయోగించి కార్యక్రమాలను చేపట్టాలని ఆరోపించారు. ప్రస్తుత రెవెన్యూ డివిజన్‌లో రైతుల కేసులు అనేకంగా పెండింగ్‌లో ఉంటాయి. ఇప్పుడింకో డివిజన్‌లో ఆ కేసులను కలిపితే కొత్త అధికారులు ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారని  ప్రశ్నించారు. 

పదిజిల్లాలే పట్టించుకోని కేసీఆర్‌ ఇక 31 జిల్లాలంటే ఎలా?
పరిపాలన ఎలా చేయాలనేది దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలని శివకుమార్‌ సూచించారు. పది జిల్లాల్లోని సంక్షేమాన్ని పట్టించుకోని కేసీఆర్‌ 31 జిల్లాల పరిపాలనను ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. ప్రజలు తమ కష్టాలను చెప్పుకుందామని వచ్చినా సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, ప్రతిపక్షనేతలకే సమయమివ్వని కేసీఆర్‌ ప్రజలకెలా ఇస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు 31 జిల్లాలకు ఏ విధంగా సమయం కేటాయిస్తారో ఆలోచించుకోవాలన్నారు. ఎమ్మార్వో కార్యాలయాలను తహశీల్దార్‌ కార్యాలయంగా మారుస్తున్నామని, ఏదో పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లోనే వైయస్‌ఆర్‌ తహశీల్దార్‌ కార్యాలయంగా మార్చారని గుర్తు చేశారు. తెలియకపోతే తెలుసుకోవాలని కానీ తానే ఫైనల్‌ అన్నట్లు వ్యవహరించొద్దని హితవుపలికారు. కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పిన మాటలను  నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం సెంటిమెంట్‌ ఓట్‌బ్యాంక్‌తో టీఆర్‌ఎస్‌కు అధికారం వచ్చింది తప్ప కేసీఆర్‌ను మెచ్చివచ్చింది కాదన్నారు. నియంతపాలనతో ముందుకు పోతున్న కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 
Back to Top