ఇదేనా.. ఉద్యమకారుడి లక్షణం?

హైదరాబాద్ :

'ఆంధ్రలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణ ద్రోహులే' అంటూ కేసీఆర్‌ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. సీమాంధ్రులను, వారి అలవాట్లను, సంస్కృతిని అవమానించిన కేసీఆర్‌ తాజాగా సీమాంధ్ర ఉద్యమాన్ని కూడా కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంపై భగ్గుమంది. కేసీఆర్‌ వ్యాఖ్యలను పార్టీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకరరావు, వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ఖండించారు. ఉద్యమకారునిగా ఉన్న కేసీఆర్‌ మరో ప్రాంతంలో ఉద్యమం చేస్తున్న ప్రజలను, నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీలను అవహేళన చేస్తూ మాట్లాడడం తగదని వారు హితవు చెప్పారు. స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్న సీమాంధ్రులను, వారి సమ్మెను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం నిజమైన ఉద్యమకారుడి లక్షణం కాదన్నారు. నిజాం కళాశాల మైదానంలో ఆదివారం జరిగిని సకల జన భేరిలో కేసీఆర్‌ వ్యాఖ్యల అనంతరం జూపూడి, పద్మ మీడియాలో మాట్లాడారు. సమైక్యాంధ్రకు నాయకత్వం వహిస్తున్న.. సీమాంధ్రుల ఆకాంక్షలకు సమీపంగా ఉన్న పార్టీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఒక్కటే అన్నారు.

కేసీఆర్ బాధ్యతా రాహిత్యం : జూపూడి :
టిఆర్ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. సకల జనభేరీ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రజలు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా మాట్లాడారన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని ఇంత చులకన చేస్తారా? అని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని,  ఎవరెవరు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసన్నారు. ఉద్యమాన్ని చులకన చేయడం మంచిది కాదన్నారు. యువనేత శ్రీ వైయస్ జ‌గన్మోహన్‌రె‌డ్డి జైలు నుంచి బయటకు వస్తుంటే జనం లక్షలాది మంది తరలి వచ్చారని చెప్పారు. శ్రీ జగన్‌ ఒక్కరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారన్న ఆశ, నమ్మకంతో వారంతా వచ్చారన్నారు.

సీమాంధ్రులను రెచ్చగొడుతున్నారు : వాసిరెడ్డి పద్మ:
సీమాంధ్ర ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా కె. చంద్రశేఖరరావు మాట్లాడారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆంధ్రలో పుట్టినవారందరిని తెలంగాణ ద్రోహులని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్రలో ఉన్నది మనుషులు కాదా? వారు చేస్తున్నది ఉద్యమం కాదా? అని అడిగారు. 60 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడటం భావ్యం కాదన్నారు. సీమాంధ్రలో గొప్ప ఉద్యమం సాగుతోందన్నారు.

రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలుగా చేయడానికి ప్రయత్నిస్తే, కేసీఆర్‌ తన మాటల ద్వారా ముక్కలు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పద్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. అహంకారపూరితంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. అందరి ఇష్ట ప్రకారమే ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని చెప్పారు. ఒక పక్క హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోవాలని అంటున్నారు, మరో పక్క కేసీఆర్‌ బండలేస్తున్నట్లు మాటలాడుతున్నారన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉందని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

Back to Top