కేసీఆర్‌ మాయల పకీర్‌

ఆరోగ్యశ్రీ వైయస్‌ఆర్‌ మానసపుత్రిక
దాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర
రోగుల అవస్థలు పట్టవా?
తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలిl
 వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి

హైదరాబాద్‌: రెండేళ్లుగా  తెలంగాణ ప్రజలను మాయచేసి మాయల పకీర్ లా కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వైయస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. మేనిఫెస్టోను భగవద్గీత అని చెప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు అందులోని ఏ అంశాలను నెరవేర్చారో చెప్పాలన్నారు. మొదటి క్యాబినెట్‌ మీటింగ్‌లో 43 నిర్ణయాలు తీసుకుంటే అందులో ఒక్కటైనా నెరవేర్చావా అని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన ఆరోగ్య శ్రీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చు అన్న బృహత్తరమైన కార్యక్రమంతో ఆరోగ్యశ్రీని పెట్టి వారిలో భరోసాను కల్పించారని గుర్తు చేశారు. ఆయన మరణాంతరం ప్రభుత్వాలు ఆ పథకాన్ని నీరుగారుస్తున్నాయని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 

2007లో మూడు జిల్లాల్లో ఆరోగ్యశ్రీని ప్రారంభించి 9 నెలల్లోనే విజయవంతంగా 23 జిల్లాలకు విస్తరింపజేశారని చెప్పారు. దాదాపు 850 రుగ్మతలు పథకంలో పెడితే వాటిలో కేసీఆర్ 250కు పైగా తీసేశారని మండిపడ్డారు. రెండు సంవత్సరాల కాలంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేస్తున్న ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వస్తోందన్నారు. రూ. 450 కోట్లకు బకాయిలు పెరిగిపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు గురువారం రాత్రి నుంచి సేవలను నిలిపివేశారని పేర్కొన్నారు. బకాయిలు చెల్లిస్తే వైద్యసేవలను కొనసాగిస్తామని యాజమాన్యాలు చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డిలు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్యం కోసం గ్రామాల నుంచి రోజుకు కొన్ని వందల మంది పేషంట్స్‌ వస్తుంటారని ఇలాంటి సమయంలో ఆసుపత్రి వర్గాలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. తక్షణమే రూ. 450 కోట్ల బకాయిలను చెల్లించి, ఆరోగ్య శ్రీ పథకంలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. 

ఆ లోపాయికార ఒప్పందాలేంటి..?
 తెలుగు రాష్ట్రాల సీఎంలు లోపాయికార ఒప్పందాలు చేసుకొని న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారా సమాధానం చెప్పాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్‌ చేశారు. భారతదేశ చరిత్రలో న్యాయవాదులు ఉద్యమాలు చేయగా చూశాం కానీ., న్యాయమూర్తులు ధర్నాలు చేసి అరెస్ట్‌లు కావడం తొలిసారిగా చూస్తున్నామని దుయ్యబట్టారు. న్యాయవాదులు ధర్నాలు చేస్తుంటే ఇరు రాష్ట్రాల సీఎంలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. హైకోర్టు విభజనపై ఇరు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర న్యాయశాఖమంత్రితో కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. దీనిపై ఖచ్చితనమైన నిర్ణయం తీసుకునే అవసరం ఉందని చెప్పారు. దాన్ని పక్కనబెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నాడని ఫైరయ్యారు.  హైకోర్టు విభజనలో నీ పాత్ర ఏమిటీ..? నీవు, చంద్రబాబు లోపాయకార ఒప్పందాలు చేసుకున్నారా..? సెక్షన్‌ 30పై ఎందుకు ఆలోచన చేయడం లేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. ప్రగల్భాలు పలకడానికి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తానని చెబితే కుదరదని చురకంటించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏం పట్టారు. ఎవరికి పవర్స్‌ ఇచ్చారు అనేదానిపై చర్చ ఎందుకు జరగడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. విభజన  తరువాత ప్రజల మనోభావాలు, భావోద్వేగాలతో సీఎంలు రాజకీయం చేస్తున్నారన్న అనుమానం కల్గుతుందన్నారు. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు. 
Back to Top