అవినీతిలో బాబు, కేసీఆర్ ల పోటీ

()రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది
()త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతాం
()కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు
()ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల నుంచి చేప పిల్లల పెంపకం దాకా అంతా అవినీతే
()వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్  

హైదరాబాద్ః అవినీతిలో చంద్రబాబును మించి పోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తహతహలాడుతున్నారని టీ వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్‌ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్న అవినీతిని త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. బంగారు తెలంగాణ సాధిస్తామని ఊరూరా తిరిగి డప్పు కొట్టుకుంటున్న కేసీఆర్‌ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్‌ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు. అవినీతి జరుగుతున్నట్లు మీ దృష్టికొస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సెల్‌ నంబర్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి షాదీ ముబారక్‌ పథకంలో జరిగిన అవినీతిపై అధికారులు నివేదిక ఇచ్చినా నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్, నకిలీ విత్తనాలు, గులాబీ ట్రాక్టర్లు ఇలా అడుగడుగునా సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్న అవినీతి కేసీఆర్‌కి తెలిసే జరుగుతుందన్నారు. తెలంగాణ వస్తే సంతోషంగా ఉంటామన్న ప్రజల ఆశలు నీరుగారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శివకుమార్ మాట్లాడారు. 

చేప పిల్లల పెంపకంలోనూ అవినీతే...
రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నుంచి చేప పిల్లల పెంపపం వరకు అవినీతి రాజ్యమేలుతుందని శివ కుమార్‌ పేర్కొన్నారు. ఆఖరుకు రైతులకు అందే సబ్బిడీల సొమ్మును కూడా టీఆర్‌ఎస్‌ నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. ఆగస్టులో పెంచాల్సిన చేప పిల్లలను హఠాత్తుగా ఇప్పుడెందుకు చెరువుల్లో వదిలారని ప్రశ్నించారు. ప్రభుత్వం రూ. 1.20పైసలకు చేప ధర నిర్ణయించగా 60 పైసలకే టెండర్‌ దక్కించుకున్న వ్యక్తి లక్ష చేప పిల్లలను చెరువుల్లో వదలాల్సి ఉండగా కేవలం 20 వేల చేప పిల్లలనే వదిలారని పేర్కొన్నారు. ఫిషరీస్‌ బోర్డు నిర్వహించాల్సిన చేప పిల్లల పెంపకాన్ని ప్రభుత్వ పెద్దలే సొంతంగా చేపట్టి రూ. 49 కోట్ల ప్రజా ధనాన్ని సొంత మనుషులకు కట్టబెట్టారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై  నిత్యం పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతిని బయట పెట్టేందుకు త్వరలోనే ఆధారాలతో సహా మీ ముందుకొస్తానని విలేకరుల సమావేశంలో శివకుమార్‌ వెల్లడించారు. 

 

తాజా వీడియోలు

Back to Top