గ్రూప్‌–1 రిటైర్డ్‌ అధికారి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


 


క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ప్ర‌జాద‌ర‌ణ ఎక్కువ‌వుతోంది. నాలుగున్న‌రేళ్ల టీడీపీ పాల‌న‌లో విసిగిపోయిన వారంతా వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరుతున్నారు. రిటైర్డు అధికారులు కూడా వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇటీవ‌ల రిటైర్డు ఐజీ ఇక్బాల్ అహ్మ‌ద్ వైయ‌స్ఆర్‌సీపీలో చేర‌గా తాజాగా క‌ర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన  గ్రూప్‌–1 రిటైర్డ్‌ అధికారి నరసింహం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. బ‌న‌గాన‌ప‌ల్లె పట్టణంలోని వీఆర్, ఎన్‌ఆర్‌ పంక్షన్‌ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన  పార్టీ  కోవెలకుంట్ల మండల బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు  రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌(స్టేట్‌ ట్యాక్స్‌) నరసింహం.. కాటసాని సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  1996 గ్రూప్‌–1 బ్యాచ్‌కు చెందిన నరసింహం.. వైయ‌స్ఆర్, అనంతపురం జిల్లాల్లో  పనిచేశారు. వైయ‌స్ఆర్‌ జిల్లాలోని విజిలెన్స్‌అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయకత్వం అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల మంది ప్రజలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో  1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగులకు భృతి కింద ఏడాదికి రూ. 1500 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు.  గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల ఊబిలో కూరకపోయారన్నారు. వైయ‌స్ఆర్  పాలన సువర్ణ యుగమని, మళ్లీ అలాంటి పాలన రావాలంటే వైయ‌స్ఆర్‌ తనయుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సాధ్యమవుతుందన్నారు. వైయ‌స్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. 
 
Back to Top