కరెంటు లేక ఎండుతున్న బోర్లు

జి. యడవల్లి(నల్గొండ)12 ఫిబ్రవరి 2013:

వేలాది రూపాయలు ఖర్చుచేసి పంట సాగు చేస్తే ఉపయోగం లేకపోయిందనీ, ఉన్న కొద్దిపాటి గింజలను తినడానికి ఉంచుకున్నామనీ రైతులు వాపోయారు. కరెంటు బిల్లులు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నల్గొండ జిల్లా జి. యడవల్లిలో శ్రీమతి వైయస్ షర్మిల మంగళవారం నిర్వహించిన రచ్చబండలో రైతులు, మహిళలు తమ ఇబ్బందులను ఆమెకు చెప్పుకున్నారు. దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మంగళవారం మరో ప్రజాప్రస్థానం కార్యక్రమాన్ని నల్గొండ నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఇబ్బందులు చెప్పుకుంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు. పొలానికి వెడితే కన్నీళ్ళు వస్తున్నాయని శ్రీమతి షర్మిలకు చెప్పారు. చెరకు పంట ఎండిపోయిందని ఓ మహిళ ఆమెకు తెలిపారు. కరెంటు లేదనీ, ఉన్నా అరగంట, గంటకు మించి ఇవ్వడం లేదనీ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. పొలాలు ఎండిపోతున్నాయనీ, చీకట్లో బతుకుతున్నామనీ వివరించారు. పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటోందన్నారు. ఏడు గంటల కరెంటు రావడం లేదా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించినపుడు రావడం లేదంటూ పెద్దగా చెప్పారు. ఎకరంన్నర పొలంలో చెరకు, వరి వేశాననీ, గంటన్నర కూడా విద్యుత్తు రాలేదనీ, దీనివల్ల పొలం మొత్తం ఎండిపోయిందనీ ఓ మహిళా రైతు విచారం వ్యక్తంచేశారు. ముప్పై వేల రూపాయలు ఖర్చు చేస్తే నాలుగు పుట్ల వడ్లు మాత్రమే వచ్చాయనీ, రెండు పుట్లను తిండికి ఉంచుకున్నామనీ చెప్పారు. కరెంటు లేక పొలాలు, బావులు, బోర్లు మొత్తం ఎండిపోయాయని తెలిపారు. తాగడానికి నీళ్ళు కూడా లేవన్నారు. ఇళ్ళకు కూడా అరగంట మించి కరెంటు సరఫరా ఉండటం లేదన్నారు. పొలానికి కౌలు చెల్లించకపోతే యజమాని ఊరుకోడు కదా అని ప్రశ్నించారు. ఇన్ని కష్టాల్లో ఉంటే పట్టించుకునే పాలకులే లేరని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.

Back to Top