ఉయ్యూరు (కృష్ణా జిల్లా), 30 మార్చి 2013: కరెంటు చార్జీల పెంపు, ఉచిత విద్యుత్‌పై చంద్రబాబు నాయుడి వైఖరి ఏమిటని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డ సోదరి శ్రీమతి షర్మిల నిలదీరు. ఎనిమిదేళ్ళ అధికారంలో ఎనిమిసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని విద్యుత్ ఉద్యమం చేయిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఇప్పుడు ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 106వ రోజు శనివారం కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానంలో ఈ ప్రజా కంటక ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన చంద్రబాబుది కాదా ఈ విద్యుత్ చార్జీల పెంపు పాపం అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కిరణ్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు చంద్రబాబే అని శ్రీమతి షర్మిల నిప్పలు చెరిగారు.
ఒక వైపున ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే మరో పక్కన దానికి రక్షణ కవచంలా నిలుస్తున్న చంద్రబాబు తనది రెండు నాల్కల ధోరణి అని తనకు తానే నిరూపించుకుంటున్నారని శ్రీమతి షర్మిల తూర్పారపట్టారు. చంద్రబాబును మించిన రంగులు మార్చే వారు ఇంకెవ్వరూ లేరన్నారు. చంద్రబాబును చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయని ఎద్దేవా చేశారు. రూ. 50 ఉన్న హార్సు పవర్ ధరను రూ. 625 చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్రతిఏటా విద్యుత్ ఛార్జీలు పెంచుతామని ప్రపంచ బ్యాంకుతో చంద్రబాబు ఒప్పందం చేసుకోలేదా? రైతులపై విద్యుత్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను చంద్రబాబు పెట్టలేదా? అని నిలదీశారు. చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు మహానేత వైయస్ 13 రోజులు దీక్ష చేశారని గుర్తుచేశారు. అయన దీక్ష ఆఖరి రోజున బషీర్‌బాగ్‌లో ముగ్గురిని కాల్చి చంపించిన ఘనుడు చంద్రబాబు అని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. ఆ కాల్పుల్లో మృతి చెందిన విద్యుత్ ఆందోళకారుల కుటుంబాలను కాకుండా కాల్చి చంపిన పోలీసులను చంద్రబాబు పరామర్శించిన వైనాన్ని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టిన చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని శ్రీమతి షర్మిల అన్నారు.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 7 గంటల పాటు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ లేకపోవడంతో రైతులు, విద్యార్థులు, పరిశ్రమల వారు ఇలా అన్ని రకాల వర్గాలూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సమస్య తీర్చమని సిఎం కిరణ్ కుమార్‌రెడ్డిని అడిగితే తలుపులు, కిటికీలు తెరుచుకుని పడుకోమని ఉచిత సలహా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఇవ్వకపోయినా చార్జీలు, సర్‌చార్జీల పేరుతో రూ. 32 వేల కోట్ల ఆర్థిక భారం వేసి రక్తం పిండి వసూలు చేయడమేమిటని ఆమె నిలదీశారు. కిరణ్ ప్రభుత్వ నిర్ణయాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయాన్నారు.
డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉంటే ఇలాంటి దుస్థితి వచ్చేదే కాదన్నారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం ఆ మహానేత కన్న తండ్రి స్థానంలో ఉండి ఆలోచించారు కనుకే ఆయన జనం గుండెట్లో దేవుడిగా నిలిచారన్నారు. ఒక్క రూపాయి కూడా కరెంటు, ఆర్టీసీ చార్జీలు, గ్యాస్ ధరలు పెంచకుండానే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన ఏకైక రికార్డు ముఖ్యమంత్రి వైయస్ ఒక్కరే అన్నారు.
కాంగ్రెస్, టిడిపిలు అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుపాలు చేశారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్నను ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం వారికి లేదన్నారు. అందుకే సిబిఐ వెనకాల దాక్కుని జగనన్నపై కుట్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బోనులో ఉన్న సింహం సింహమే అన్నారు. జగనన్నను ఆపడం వీళ్ళెవ్వరి తరమూ కాదని శ్రీమతి షర్మిల ధీమాగా చెప్పారు. మంచివారి పక్షాన దేవుడు నిలబడతాడన్నది నిజం అన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ప్రతి మాటనూ నిలబెడతారని హామీ ఇచ్చారు. ఏ ఒక్కరూ గుడిసెలో ఉండకూడదని, పక్కా ఇళ్ళలో ఉండాలని కలలు కన్న రాజన్న ఆశయాన్ని జగనన్న నెరవేరుస్తారన్నారు. అంతవరకూ జగనన్నను ఆశీర్వదించమని, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచమని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు.
కాగా, శ్రీమతి షర్మిల శనివారంనాటి పాదయాత్ర షెడ్యూల్ ముగిసింది. ఉయ్యూరులో బహిరంగ సభ అనంతరం సమీపంలోని సిబిఎం కాంపౌండు వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. శనివారంనాడు ఆమె మొత్తం 15.1 కిలోమీటర్లు నడిచారు. మరో ప్రజాప్రస్థానం 106వ రోజు వరకూ శ్రీమతి షర్మిల 1,445.5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు.