కన్నీరు పెట్టిన షర్మిల

సరంపేట (నల్గొండ జిల్లా) : ఫ్లోరోసిస్‌ వ్యాధి బాధితుల కష్టాలు విని చలించిపోయిన శ్రీమతి షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. ఈ బతుకు మరెవరికీ రాకూడదమ్మా అంటూ బాధితులు చెప్పుకొన్న కష్టాలు విని విలవిల్లాడిపోయారు. ‘ఇన్నాళ్లూ పేపర్లు, టీవీల్లో చూడడమే గాని.. సమస్య ఇంత దారుణంగా ఉందని తెలియదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రజాప్రస్థానం 62వ రోజు ఆదివారంనాడు శ్రీమతి షర్మిల నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండల గ్రామాల్లో కొనసాగించారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల కొందరు ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్థుల వెతలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంశల స్వామి అనే వ్యాధి పీడితుడు తన గోడు వెళ్ళబోసుకుంటూ... ‘మా చెల్లెకూ ఫ్లోరోసిస్ వ్యాధి ఉంది.. నాకూ వచ్చింది.. అమ్మ చెల్లెను, నన్ను చూసి తట్టుకోలేకపోయింది. పిచ్చిదైపోయింది.. నాన్న నన్ను చూసుకున్నాడు‌... కానీ చెల్లెను చూసుకోవాల్సిన అమ్మకు మతిస్థిమితం లేకపోవడంతో 11 ఏళ్ల వయసున్న నా చెల్లి చనిపోయింది’ అంటూ స్వామి బిగ్గరగా ఏడ్చాడు. వారి కష్టాలు విన్న షర్మిల కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

మరో దిక్కులేక.. ఆ నీళ్ళే తాగుతున్నాం‌ :
ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ‌తీరుకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండల గ్రామాల్లో కొనసాగింది. దాదాపు 15 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో దారిపొడవునా ఫ్లోరైడ్ బాధితులు ఉండటాన్ని గమనించిన శ్రీమతి షర్మిల సరంపేట‌లో నిర్వహించిన రచ్చబండలో వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక్కడ తాగే నీళ్లలో సగటున 8 పిపిఎం(పార్టు పర్ మిలియ‌న్) ఫ్లోరై‌డ్ ఉందని, ఈ నీళ్లు తా‌గేందుకు అస్సలు  పనికిరావని 1940లోనే తేలింది. అది తెలిసి కూడా మరో దిక్కు లేక ఇక్కడి ప్రజలు ఈ నీళ్లనే తాగుతున్నారని స్థానిక నాయకులు శ్రీమతి షర్మిలకు వివరించారు.

‘నల్లగొండ జిల్లా ప్రజలను దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ ఎంతగానో ప్రేమించారు. ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరై‌డ్ సమస్యతో బాధపడుతున్నారని, వాళ్లకు కృష్ణా జలాలు అందిస్తేనే బతుకుతారని చె ప్పేవారు. ఈ జిల్లాలో 975 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. వై‌యస్‌ఆర్ కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ ఫ్లోరోసి‌స్ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన ఒక్క వై‌యస్‌ఆర్‌కే వచ్చింది' అని శ్రీమతి షర్మిల తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఎనిమిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి కేవలం రూ. 9 కోట్లు మాత్రమే ఫ్లోరైడ్ బాధితుల కోసం ఖర్చు చేశారు. అదే వై‌యస్‌ఆర్ రూ.375 కోట్లు ఖర్చు చేసి 450 ఫ్లోరై‌డ్ పీడిత గ్రామాలకు కృష్ణాజలా‌లు అందించారు. మరో 525 గ్రామాలకు నీళ్లు అందించాల్సి ఉంది. ఈలోగా ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోవడంతో ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి’ అని గుర్తుచేశారు. ‘ఇప్పటి పాలకులకు మనసు లేదు. వీళ్లు చేయరు. నేను మీకు మాటిచ్చి చెప్తున్నా.. వైయస్‌ఆర్ తనయుడిగా.. నాన్నగారు మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన పనులను జగనన్న పూర్తి చేస్తారు. మిగిలిన 525 గ్రామాలకు మంచి నీళ్లు అందిస్తారు. త్వరలోనే జగనన్న వస్తారు.. తరతరాలుగా ఈ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరై‌డ్ రక్కసి నుంచి మిమ్మల్ని రక్షిస్తారు’ అని భరోసా ఇచ్చారు.

మహానేత ఒక్కరే ఆదుకునే ప్రయత్నం చేశారు:
 ‘అమ్మా.. నిజాం కాలం నుంచి ఇప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వరకు ప్రతి ఒక్కరు ఫ్లోరైడ్‌ బాధితుల కష్టాలను చూశారు. వారి మీద జాలి చూపారు. ఆదుకుంటామన్నారు. మళ్లీ మొహం చూపించలేదు. చంద్రబాబు నాయుడు... చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్.. నాదెండ్ల మనోహ‌ర్.. వేరే దేశాలోళ్లు చాలా మంది వచ్చిపోయారు. ఒక్క వై‌యస్‌ఆర్ మినహా మరే ‌నాయకుడూ మమ్మల్ని ఆదుకునే ప్రయత్నమే చేయలేదమ్మా’ అని ఫ్లోరోసిస్ వ్యాధి బాధితులు పొనుగంటి తిరుపతమ్మ, అంశల స్వామి తమ గోడు చెప్పుకొన్నారు. ‘ఈ బతుకు ఎవ్వరికీ రావొద్దక్కా... రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. ఆరో తరగతి వరకు బాగానే ఉన్నాను. అందరి పిల్లల మాదిరిగానే నడిచాను.. పరిగెత్తాను. ఏడో తరగతిలో కాళ్లు మెలి తిరిగిపోయినయి. భరించలేనంత నొప్పి.. నా బాధలు చూడలేక అమ్మ చనిపోయింది. 10వ తరగతి పరీక్షలు రాయలేకపోయాను. ఇప్పుడు నా వయసు 33 ఏళ్లు. నా వ్యాధి ఇంకొకరికి రావొద్దక్కా.. మా పల్లెలకు నీళ్లు తెప్పించండి’ అని తిరుపతమ్మ‌ శ్రీమతి షర్మిలతో చెప్పి కన్నీళ్లు పెట్టింది.‘రాష్ట్రపతిని కలిసి మా గోడు చెప్పుకున్నా మా కష్టం తీరలేదక్కా... వైయస్‌ఆర్ తీర్చాడు. పల్లెలకు కృష్ణా నీళ్లు తెచ్చాడు’ అని కుదాసిపేటకు చెందిన 33 ఏళ్ల రజిత వెల్లడించింది.‌

‌కాంగ్రెస్ చెబితే చంద్రబాబు అవిశ్వాసం:
‌మార్గమధ్యంలో తనను కలిసి కన్నీరు పెట్టుకున్న రైతుల గురించి షర్మిల ప్రస్తావిస్తూ.. ‘పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తికి గిట్టుబాటు ధరలేక అప్పుల పాలైనామని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. పసుపు, వరి, వేరుశనగ, మిరప పండించే ప్రతి రైతు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా పాదయాత్రలంటూ పల్లెల వెంట తిరుగుతూ నాటకాలు ఆడుతున్నారు. ఆయనకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబునాయుడూ అంటే.. పెట్టను గాక పెట్టను అంటారు. పైగా ఇప్పుడు అవసరం వస్తే అవిశ్వాసం పెడతానని కొత్త నాటకం ఆడుతున్నారు. ప్రజలకు అవసరం వచ్చినప్పుడు కాదండీ ఆయనకు అవసరం వచ్చినప్పుడు అవిశ్వాసం పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల బలం సరిచూసుకొని, చంద్రబాబు నాయుడు ఇక ఇప్పుడు అవిశ్వాసం నాటకమాడు అని పచ్చజెండా ఊపితే అప్పుడు చంద్రబాబు అవిశ్వాసం పెడతారు’ అని విమర్శించారు.

నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న శ్రీమతి షర్మిల పాదయాత్ర ఆదివారం మర్రిగూడెం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గునగల్ క్రా‌స్ రోడ్డు, సరంపేట, గర్శగడ్డ, పాకగూడెం గ్రామాల మీదుగా లెంకలపల్లికి చేరింది. ఇక్కడ నీటిశుద్ధి కేంద్రాన్ని‌ శ్రీమతి షర్మిల ప్రారంభించారు. అదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.1 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 897.2 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు ఎం.వి. మైసూరారెడ్డి, కె.కె. మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబో‌స్, సంకినేని వెంకటేశ్వరరావు, బీరవోలు సోమిరెడ్డి, తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ తదితరులు‌ పాదయాత్రలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top