కనిగిరి: నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరు రైతు దీక్షలో వైయస్ జగన్‌కు కంది. శనగ రైతుల సమస్యల వినతిని అందించినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా బుర్రా బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ.. రెండేళ్ల నుంచి కంది రైతులు తీవ్ర నష్టాలో కూరుకుపోయి వున్నారని, గతంలో కంది ధర క్వింటాకు రూ 11 నుంచి 12 వేల వరకు ఉండేదని కనీస గిట్టుబాటు ధర లేక, వచ్చిన దిగుబడి అమ్మకాలు జరగక వేల క్వింటాలు ఇళ్లల్లోనే మగ్గుతున్నట్లు వైయస్ జగన్‌కు వివరించానన్నారు. ప్రభుత్వ మార్క్ ఫెడ్ ద్వారా క్వింటా రూ 5,500 కొనుగోలు చేస్తామని చెప్పినా..అమలు జరగడం లేదన్నారు. లక్షలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగు నీటి ట్యాంకర్ల వద్ద ప్రతి రోజు నీటి యుద్దాలతో స్టేషన్లకు వెళ్తున్నట్లు అధినేత వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని వైయస్ జగన్‌ను కోరినట్లు తెలిపారు.