ఒంటరిగా సత్తా చాటుతాం

ఖమ్మం:  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుతుందని  ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి కమల్ రాజు తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర పార్టీ విధానాలకు అనుగుణంగా  వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీల వెనకాల ఉంటూ ఓట్లు ఆకర్షించే పనిలో ఉన్నాయని..వైఎస్సార్సీపీ ఒక్కటే ఒంటరిగా సత్తా చాటాలని ఎన్నికల బరిలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తన బలం నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు.  


దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తే...కేసీఆర్ వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారని కమల్ రాజు మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీటీసీలుగా గెలిచిన వాళ్లను ఉత్సవ విగ్రహాల్లాగా ఉంచుతుంది తప్ప ఎక్కడా నిధులు ఇవ్వడం లేదన్నారు. దీంతో, ఎంపీటీసీలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారని కమల్ రాజు పేర్కొన్నారు. వాళ్ల తరుపున తమ వాణిని శాసనమండలిలో వినిపించాలంటే అవగాహన ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీని ఆదరిస్తారన్న నమ్మకముందన్నారు.  ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా ఉంటుందని...జిల్లా ప్రజల దీవెనలతో  వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నామన్నారు.  

ఖమ్మం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లింగాల కమల్ రాజ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వైఎస్సార్సీపీ  అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు పార్టీకి కమల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. 
Back to Top