కాల్పులు ప్రభుత్వ వైఫల్యమే

హైదరాబాద్‌: నంద్యాల పట్టణంలో పట్టపగలు టీడీపీ నేత కాల్పులు జరపడం ప్రభుత్వ వైఫల్యమే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. నంద్యాలలో వైయస్‌ఆర్‌సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డిపై భూమా వర్గీయుడు అభిరుచి మధు కాల్పులు జరపడాన్ని అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. నంద్యాలలో టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు కూడా వారికే వత్తాస పలుకుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం మెప్పుకోసం అధికారులు, పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో గత నెల రోజులుగా వైయస్‌ఆర్‌సీపీ నేతలను టార్గెట్‌ చేశారని విమర్శించారు. మూడు రోజులుగా శిల్పా కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టపగలు టీడీపీ నేతలు కాల్పులు జరపడం దారుణమని ఫైర్‌ అయ్యారు. టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నడిరోడ్డుపై రౌడీలు వీరవిహారం చేస్తుంటే పోలీసులు పారిపోతున్నారని తప్పుపట్టారు. అభిరుచి మధును వెంటనే అరెస్టు చేయాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

Back to Top