కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐ

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషన్ విచారణకు  సీబీఐ మరోసారి మోకాలడ్డిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు. సీనియర్ అడ్వొకేట్ అందుబాటులో లేరంటే ఈనెల 22 కు కేసును వాయిదా వేయించిన  తీరును ఆమె గర్హించారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మేము చేసిన ఆరోపణలు, విమర్శలు ఈ వాయిదాతో నూటికి నూరుపాళ్లు నిజమని తేలిందని స్పష్టంచేశారు.  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కక్షగట్టినట్లు, ఈ కేసులో ప్రత్యేక అజెండా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 'శుక్రవారం విచారణ ఉందన్న విషయం సీబీఐకి  ఎప్పుడో తెలుసు. సీబీఐకి సీనియర్ అడ్వొకేట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. లేరని కోర్టులో చెప్పడం బూటకం. ఉద్దేశపూర్వకంగానే సీబీఐ ఇలా చేసింది.' అంటూ వాసిరెడ్డి పద్మ వివరించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా సాధ్యమైనంత సాగదీసేందుకే ఇలా చేసిందన్నారు.  బెయిలు వస్తుందా రాదా అనే విషయం పక్కనపెడితే..విచారణ సందర్భంగానే వాయిదా కోరడం ఇలా భావించడానికి తావిస్తోందన్నారు.  ఓ అజెండా ప్రకారం, రహస్య ఆదేశాలున్నట్లుగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. తమ వద్ద ఎన్నో ఆధారాలున్నట్లు పత్రికలకు ఫొటోలతో వార్తలు లీక్ చేసిందన్నారు. ఎన్నికల సమయంలో అరెస్టు నుంచి నాటి నుంచి విచారణ కూడా ఎదుర్కోకుండా శ్రీ జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా జైలులో ఉంచేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానమూ  కలుగుతోందన్నారు. మూడు నెలల్లో విచారణ పూర్తిచేస్తామని సుప్రీం కోర్టుకు సీబీఐ చెప్పిన గడువు శుక్రవారంతో పూర్తయ్యిందన్నారు. ఇంతవరకూ ఎంత మేరకు విచారణ పూర్తయ్యిందో కోర్టుకు చెప్పరన్నారు. శ్రీ వైయస్ జగన్ జైలునుంచి బయటకొస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని చెప్పుకొస్తోందనీ, అరెస్టు నాటి నుంచి ఇదే మాట వల్లెవేస్తున్నారనీ వాసిరెడ్డి తెలిపారు. సీబీఐ, ప్రభుత్వమూ కలిసి న్యాయ వ్యవస్థనూ, ప్రజాస్వామ్య వ్యవస్థనూ అపహాస్యం చేస్తున్నాయని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకంతో ఎదురుచూడడం తప్ప మేము చేయగలిగిందేమీ లేదన్నారు. శ్రీ వైయస్ జగన్ బెయిలుపై బయటకు రాకుండా.. విచారణ చేయకుండా పబ్బం గడుపుకుంటున్నారు. న్యాయవ్యవస్థ దీన్ని గమనిస్తుందని ఆశిస్తున్నామని ఆమె ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.  ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఎంత భయపడుతున్నదీ దీనిద్వారా  వెల్లడవుతోందని పేర్కొన్నారు. విచారణ మీద, ప్రజాస్వామ్యం మీద ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉన్నదీ కూడా తెలుస్తోందని చెప్పారు.  అధికారంలో ఉన్న మంత్రులు, అధికారులు సాక్షుల్ని ప్రభావితం చేయరు గానీ, జైలులో ఉన్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తాని చెప్పడం ఎంతవరకూ సహేతుకమని ఆమె ప్రశ్నించారు. మంత్రులు, అధికారుల మీద ఆరోపణలొస్తే తేల్చరు, వారందరినీ కాపాడతారని ఆరోపించారు. ఐదు లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో శ్రీ జగన్  గెలవడమే పాపమన్నట్లూ, పార్టీకి అధ్యక్షుడు కావడమే నేరమన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆమె చెప్పారు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు ఖండన
     ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన మతపరమైన వ్యాఖ్యలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. మహానేత వైయస్ఆర్ వారసులుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సామరస్యంతో మెలగానీ, పరస్పరం గౌరవించుకుంటూ సాగాలనీ ఆమె సూచించారు. ఒక మతాన్ని కించపరచడం ఖండించదగిందనీ, దీనికి  విచారం వ్యక్తం చేస్తున్నామనీ తెలిపారు. ఇలా ఎవరు చేసినా ఖండిస్తామని పద్మ స్పష్టంచేశారు.

తాజా ఫోటోలు

Back to Top