కాకినాడలో టీడీపీకి గుణపాఠం తప్పదు

అబద్ధపు హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు
గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్న టీడీపీ 
కాపులకు రిజర్వేషన్‌లు కల్పిస్తామని ఘోరంగా అవమానించారు
మద్యం మాఫియాతో మహిళల జీవితాలతో చెలగాటం 
స్వార్థం కోసం హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు
ప్రతిపక్షనేతపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

కాకినాడ: తెలుగుదేశం ప్రభుత్వం కళ్లు మూసుకొని పరిపాలన చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. అధికారం కోసం అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. కాకినాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ... రైతాంగాన్ని, డ్వాక్రా మహిళలను, యువతను, కాపులను అందరినీ వంచించారన్నారు. చంద్రబాబు పరిపాలనలో రైతాంగం దగాపడిందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులపాలయ్యారన్నారు. ఎన్నికలకు ముందు రైతాంగానికి మద్దతు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తామని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని, ఇన్వస్ట్‌మెంట్‌ సబ్సీడీ అని దాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా రూ.3వేల కోట్లు ఇచ్చి పూర్తిగా రుణమాఫీ చేశానని గొప్పులు చెప్పుకుంటున్నారన్నారు. 

యువతను తీవ్రంగా మోసం చేసిన బాబు

ఇంటికో ఉద్యోగం ఇస్తా.. లేకుంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశాడని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు ఉంటాయని, పరిశ్రమలు పెడతారని బీరాలు పలికి చివరకు హోదాను తన స్వార్థం కోసం తాకట్టుపెట్టాడన్నారు. హోదా కోసం అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానాలు చేసి పంపిన చంద్రబాబు హోదా కంటే ప్యాకేజీ మంచిదని, హోదాకు 14 వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు చెబుతోందని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారన్నారు. ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు మళ్లీ 10 సంవత్సరాలు కొనసాగింపు ఇచ్చారని, మరి చంద్రబాబు ఎందుకు ఇప్పుడు మాట్లాడడం లేదన్నారు. 11 రాష్ట్రాలకు మరో 10 సంవత్సరాలు హోదా కొనసాగింపు ఇచ్చిన కేంద్రం మనకు ఎందుకు ఇవ్వలేదని ఏనాడైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. 

చంద్రబాబుపై మహిళలు ఆగ్రహం

ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, రియలెస్టేట్‌ మాఫియా ఇలా చంద్రబాబు రాష్ట్ర వనరులను దోచుకుతింటున్నారని ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని ఉమ్మారెడ్డి అన్నారు. బెల్ట్‌షాపులను రద్దు చేస్తానని ప్రమాణస్వీకారం రోజున సంతకం పెట్టిన చంద్రబాబు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నాడన్నారు. మద్యం వల్ల రాష్ట్ర ఆదాయం రూ.30 వేల కోట్లకు పెరిగిందన్నారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబుపై మహిళలంతా ఆగ్రహంగా ఉన్నారన్నారు. 

మరణాలపై కమిటీ నివేదిక ఇచ్చిందా..?

ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా గోదావరి పుష్కరాల్లో 29 మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. పుష్కరాల మరణాలపై ఎంక్వైరీ కమిటీ వేశామన్నారు. సంవత్సరాలు గడిచినా ఇప్పటి విచారణ కమిటీ నివేదిక ఇచ్చిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పుష్కరాల్లో చనిపోయిన బాధిత కుటుంబాలు అన్ని చంద్రబాబుకుపై కసితీర్చుకునేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. 

ముద్రగడకు తీవ్ర అవమానం..

కాపులు రిజర్వేషన్‌ కావాలని అడగకపోయినా కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కాపునేత ముద్రగడ పద్మనాభం కాపులను బీసీల్లో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తే.. ఆయనను గృహ నిర్బంధం చేసి, పోలీసులతో ఆయన కుటుంబాన్ని కొట్టించి అనేక రకాలుగా అవమానించారన్నారు. తుని సభకు వచ్చిన ప్రతి కాపు యువతపై చంద్రబాబు కేసులు పెట్టారన్నారు. కాపులు కూడా చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 

పోలవరం రాష్ట్రానిదా.. కేంద్రానిదా..

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానిదా.. లేక జాతీయ ప్రాజెక్టా అనే అనుమానం కలుగుతుందని ఉమ్మారెడ్డి అన్నారు. కేంద్రం 2014 ప్రకారం రూ.16 వేల కోట్లు ఇస్తామంటుందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు అంచెనాలు రూ.50 వేల కోట్లకు పైగా పెంచిందన్నారు. ఈ బడ్జెట్‌ ఎవరు భర్తీ చేస్తారో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. 

జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్యానికి తూట్లు

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం సక్రమంగా చేపట్టకపోవడంతో కేంద్రం నుంచి ఉచితంగా వచ్చే దాదాపు రూ.400 కోట్ల నిధులు రాకుండా పోయాయన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా పరిపాలన చేయడం దుర్మార్గపు ఆలోచన అని, ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. 

నష్టాల్లో వ్యవసాయం.

వ్యవసాయ నష్టాల్లో నడుస్తుందని, సాగు, తాగు నీరు లేకుండా పోయిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడూ సాగు తగ్గిన దాఖలాలు లేవని, గత సంవత్సరంతో పోల్చుకుంటూ 20 వేల హెక్టార్ల సాగు పడిపోయిందన్నారు. గుంటూరు 70 వేల హెక్టార్ల సాగు పడిపోయిందన్నారు. 

కసి తీర్చుకునేందుకు కాకినాడ సిద్ధం..

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ప్రజల సంక్షేమం మెరుగుపడుతుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో చర్చించే తీరు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధానం, కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీని అధికారంలోకి తీసుకొస్తుందన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, అవకాశం వస్తే టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ వైయస్‌ఆర్‌ సీపీ గెలవడం తథ్యమన్నారు. 
Back to Top