కాకినాడ కార్పొరేషన్‌ వైయస్‌ఆర్‌ సీపీదే

రాష్ట్రంలో రానుంది వైయస్‌ఆర్‌ సీపీ యుగం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ విస్తృత ప్రచారం
తూర్పుగోదావరి: కాకినాడ కార్పొరేషన్‌పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డు అభ్యర్థి సంగిశెట్టి జాహ్నవికి మద్దతుగా కురసాల కన్నబాబు, మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు, సిటీ కోఆర్డినేటర్‌ చంద్రశేఖరరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే మంచి జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. అందుకనే ఎక్కడికి వెళ్లినా ఆదరిస్తున్నారన్నారు. టీడీపీ హామీలు ప్రచారానికి తప్ప అమలుకు నోచుకోవడం లేదని, ప్రజలంతా చంద్రబాబు పరిపాలనపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. దోమల మీద దండయాత్ర అని కాకినాడ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టిన చంద్రబాబు ఆ తరువాత దోమల నివారణ చర్యలు కూడా చేపట్టలేదన్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. 
టీడీపీకి రోజులు చెల్లిపోయాయ్‌...
కాకినాడను స్మార్ట్‌ సిటీగా చేస్తానని హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా.. నేటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాకినాడను స్మార్ట్‌ సిటీగా చేసేందుకు ఎంత ఖర్చు చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. స్మార్ట్‌ సిటీ పేరుతో ప్రజల చెవ్వుల్లో పూలు పెడితే ఎవరూ నమ్మరన్నారు. రానుంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యుగమని, టీడీపీకి రోజులు చెల్లాయన్నారు
Back to Top