అన్ని వసతులతో సీహెచ్‌సీ: కాకాణి గోవర్దన్‌రెడ్డి

నెల్లూరు:  అన్ని వసతులతో పొదలకూరులో సామాజిక ఆరోగ్య కేంద్రం (క్లన్టర్ హెల్త్ సెంటర్) భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని నెల్లూరు జిల్లా  సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు క్లన్టర్ హెల్త్ సెంటర్‌కు రూ.3.80 కోట్లు మంజూరైన సందర్భంగా  శిథిలావస్థలో ఉన్న భవనాన్ని, కొత్త భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ఎమ్మెల్యే  అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ సెంటరు భవన నిర్మాణంతో పాటు అందులో పరికరాల కోసం నిధులు మంజూరైనట్టు వెల్లడించారు. పాతభవనం ముందున్న ఇరిగేషన్ శాఖకు చెందిన శిథిల భవనాలు ఉన్న స్థలాన్ని క్లన్టర్ భవన సముదాయంలో కలుపుకునేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానన్నారు. భవిష్యత్  అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలో అన్ని వసతులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పొదలకూరు చుట్టుపక్కల మండలాలకు ఇక్కడి నుంచి వైద్యసేవలు అందే అవకాశం ఉందన్నారు. సీహెచ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అవసరమైన వసతులను మాత్రం కల్పించలేదన్నారు. ఫలితంగా పీహెచ్‌సీలు సక్రమంగా పనిచేయక, హెల్త్ సెంటర్లలో సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వైద్యం అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట  బ్రహ్మయ్య, సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ కండే సులోచన, ఎంపీడీఓ శ్రీహరి, పీఆర్ ఏఈ చంద్రశేఖర్, వైద్యాధికారి వినోద్, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఆంజనేయవర్మ, ఏపీహెచ్‌ఎంఐడీసీ డీఈ రమణ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బెల్లంకొండ కాళీదాస్, నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి,  డి.విజయభాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Back to Top