కేంద్రం పంజరంలో మరో చిలుక

హైదరాబాద్, 09 మే 2013:

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టు బెయిలు మంజూరుచేస్తుందని భావించామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ చెప్పారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో కలిసి గురువారం మధ్యాహ్నం ఆయన కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కానీ, బెయిలు తిరస్కరించడంతో నిరాశకు గురయ్యామని తెలిపారు. పంజరంలో చిలుకలా సీబీఐ తయారైందని సుప్రీం వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కోల్ గేట్ కుంభకోణంలో సుప్రీం వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. సీబీఐ అడ్వకేటు గతంలో 40వేల కోట్ల రూపాయల సంపద దోపిడీకి గురైందనీ, దానికి లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డనీ పేర్కొందన్నారు. దీనిని ఎలా చెప్తారు అని కిందటేడాది జూన్ నెలలో సుప్రీం కోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి ప్రశ్నించినపుడు మొత్తం 800 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు బదులిచ్చిందన్నారు. ప్రస్తుత సీబీఐ అడ్వొకేట్ అశోక్ భాన్ కూడా మొత్తం 40 వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని కోర్టును తప్పుదోవ పట్టించే యత్నం చేశారన్నారు. ఇప్పటివరకు కోర్టుకు దాఖలు చేసిన చార్జి షీట్లన్నీ చూసినా వెయ్యి ముప్పై కోట్లు మాత్రమే వస్తోందన్నారు. ఇది కేటాయించిన భూముల విలువ మాత్రమేనన్నారు. దీన్ని బట్టి కోర్టుని సీబీఐ తప్పు దారి పట్టిస్తోందని రుజువవుతోందన్నారు. ఈ కేసు కేంద్రం పంజరంలో చిక్కుకున్న మరో చిలుకని కొణతాల అభివర్ణించారు.

కాంగ్రెస్ చెప్పిన చిలకపలుకులను సమయానుకూలంగా పలుకుతూ కోర్టులను సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందన్నారు. దీనివెనుక జగన్ గారికి బెయిలు రాకుండా చేయాలన్న కుట్ర దాగుందన్నారు. కక్ష సాధింపు చర్యలు త్వరలో బయటకొస్తాయన్నారు. త్వరలో జగన్ గారు విడుదలవుతారనీ, అప్పటివరకూ అంతా సంయమనం పాటించాలని కొణతాల విజ్ఞప్తి చేశారు.

ఆ రెండు పార్టీల మైండ్ గేమ్‌ను తిప్పికొట్టాలి
సుప్రీం తీర్పు వల్ల తమకు కొంత నిరాశ కలిగిన మాట వాస్తవమని అంబటి రాంబాబు చెప్పారు. కొన్ని అంశాలను పరిశీలించిన మీదట జగన్ గారికి ఈసారి తప్పని సరిగా బెయిలొస్తుందని ఆశించామని తెలిపారు. తీర్పు పూర్తి వివరాలు అందిన తర్వాత మరోసారి మళ్ళీ మాట్లాడతామన్నారు. వరుసగా బెయిలు పిటిషన్లను తిరస్కరింపజేసి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచి, తద్వారా కాంగ్రెస్, టీడీపీలు లబ్ధిపొందేందుకు చేసే చర్యలలో ఇది అంతర్భాగమని అంబటి వ్యాఖ్యానించారు. బెయిలును తిరస్కరించడం వల్ల శ్రేణులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు సింహస్వప్నంలా తయారయ్యారు కాబట్టి జగన్ గారిని ఏడాది పాటు జైలులో ఉంచితే ఆయన పార్టీ నిర్వీర్యమవుతుందని ఆశించారన్నారు. వారి ఆశలు నెరవేరవనీ, శ్రేణులు కసిగా పనిచేసి ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు సీబీఐ లీకులు ఇచ్చి దుష్ప్రచారం చేశారన్నారు. అలాంటి దుష్టశక్తులకు తగిన సమాధానం చెప్పాలన్నారు. జగన్ గారిని నిర్బంధించినప్పటికీ పార్టీ చెక్కు చెదరదని ఇప్పటికే నిరూపించామన్నారు. ఇంకా నిరూపిస్తామని స్పష్టంచేశారు. తమకు న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీదా పూర్తి నమ్మకముందని చెప్పారు. సీబీఐ న్యాయవాది అశోక్ భాన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిలా మాట్లాడారని విమర్శించారు. జగన్ గారికి బెయిలు తిరస్కరించడం ఇదే మొదటిసారి కాదని అంబటి చెప్పారు. ఈసారి జగన్ గారికి బెయిలొస్తుందనే ఆశ అందరిలో కలిగిందన్నారు. జగన్ గారిని సుదీర్ఘ కాలం నిర్బంధించడం వెనుక కాంగ్రెస్, టీడీపీలను పైకి తీసుకురావాలనే తపన కనిపిస్తోందన్నారు.  ఈ రెండు పార్టీలు ప్రస్తుతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. వారి మైండ్ గేమ్‌కు శ్రేణులు నిరుత్సాహపడరాదని పిలుపిచ్చారు. ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు.

Back to Top