కేంద్ర బడ్జెట్‌ నిరాశా జనకం

హైదరాబాద్, 28 ఫిబ్రవరి 2013 : ఉత్పత్తి రంగంలో వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలకు 15 శాతం ఇండస్ట్రియల్‌ అలవెన్సు ఇస్తామన్న ఒక్క హామీ తప్ప రానున్న వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్‌లో ఆశించదగిన అంశం ఏదీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సలహాదారు, కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ. సోమయాజులు వ్యాఖ్యానించారు. బొగ్గు ఉత్పత్తి సరిగా లేక, విద్యుత్‌ సరఫరా లేని పరిస్థితుల్లో మన దేశంలో ఆ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్టమెంటులో నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చూపించిన లెక్కలు దేశ ‌ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఎలాంటి ఆర్థిక పరమైన ప్రయోజనమూ లేదని తేల్చి చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల దేశంలోని 80 ‌శాతం ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు. వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సోమయాజులు బడ్జెట్‌పై స్పందించారు. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు.

తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే బడ్జెట్‌లో 33 శాతం పోతుందని, మరో 33 శాతం జీత భత్యాలకు పోగా ఇక అభివృద్ధి కార్యక్రమాలకు మిగిలేది ఏమిటని సోమయాజులు ప్రశ్నించారు. అప్పుగా తెచ్చిన డబ్బులను ఉత్పాదక రంగాల్లో పెట్టుబడి పెట్టకుండా ఆర్థిక సర్దుబాట్లకు వినియోగించినంతకాలం మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. యు.పి.ఎ. తీరు చూస్తుంటే వచ్చే ఏడాది కూడా మన దేశంలో విద్యుత్‌ ఉండని దుస్థితి దాపురిస్తుందని సోమయాజులు ఆందోళన వ్యక్తం చేశారు. యు.పి.ఎ. -2 వైఫల్యం వల్లే దేశానికి ఈ దుస్థితి ఏర్పడింద‌ని అన్నారు. దేశాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో యు.పి.ఎ. ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందని సోమయాజులు విమర్శించారు. వ్యవసాయరంగం, గ్రామీణ, చేతి వృత్తులవారికి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ బ‌డ్జెట్‌తో సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనమూ లేదని సోమ‌యాజులు వ్యాఖ్యానించారు.

మన దేశంలో ఆర్థిక అభివృద్ధి రేటు సుమారు తొమ్మిది పదేళ్ళ క్రితం 5 శాతం వచ్చిందని సోమయాజులు పేర్కొన్నారు. చిదంబరం చెప్పినట్లు తరువాత 8 శాతానికి వచ్చిందన్నారు. ఈ రెండింటికి మధ్య తేడాను ఆయన 50 మార్కులు వచ్చిన వాడికి 80 మార్కులు రావడం, మళ్ళీ తిరిగి 50 మార్కులు వచ్చిన విధంగా ఉందని అభివర్ణించారు. తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికలో మన సగటు వార్షిక ఆర్థిక అభివృద్ధి రేటు 5.3 శాతం ఉందన్నారు. 8వ పంచవర్ష ప్రణాళికా కాలం గత మూడేళ్ళలో అది 7.8 శాతంగా ఉండేదన్నారు. ఇక తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికా కాలం మొత్తం చూసుకుంటు 5.3 శాతం ఉందన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటులో ఇంత దారుణమైన కాలం, ఆర్థిక మాంద్యం ఉన్న సమయం మరొకటి లేదన్నారు. తరువాత  2003 నుంచి 08 వరకూ సుమారు 9 నుంచి 10 శాతం వరకూ మన దేశానికి వచ్చిందన్నారు. గడచిన రెండేళ్ళు, ఈ ఏడాది చూస్తే 5 శాతం ఆర్థిక అభివృద్ధి రేటు ఉందని చిదంబరం పేర్కొన్నారన్నారు.

ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా తరువాత మనదేశమే ఎక్కువగా ఉందనడాన్ని సోమయాజులు ఎద్దేవా చేశారు. కేవలం 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా ఆదాయం 14 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని, అయితే, 120 కోట్లకు పైబడి జనాభా ఉన్న మన దేశం ఆదాయం 2 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే ఉందన్నారు. ఆ దామాషాలో మన ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉండాలో ఊహించుకోవాలన్నారు. దీన్ని బట్టి మన ఆర్థికాభివృద్ధి రేటు ఏమిటో అర్థం అవుతుందన్నారు. విపరీతమైన పేదరికం ఉన్న భారతదేశంలో 5 శాతం ఆర్ధిక అభివృద్ధి రేటు, అమెరికాలోని 2 శాతం వృద్ధి రేటు సమానం కాదన్నారు. చైనా మాత్రమే మన కంటే ఆర్థిక వృద్ధి రేటులో ముందుందని, మిగతా దేశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పడాన్ని సోమయాజులు తప్పుపట్టారు.

అప్పు చేయడం తప్పు కాదుగానీ అప్పుగా తీసుకువచ్చిన నిధులను మూలధన ఆస్తులను పెంచే ఒక రామగుండంలోనో, ఒక విజయవాడ థర్మల్‌ కేంద్రంలోనో, నాగార్జునసాగర్‌, శ్రీశైలం లాంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు వినియోగించాలి తప్ప ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు వాడితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని సోమయాజులు అన్నారు. ఆ నిధులతో సిమెంటు కొనడానికో, ఇనుము కొనడానికో వినియోగించినా గనుల తవ్వకం పెరుగుతుందని, రవాణా, నిర్మాణ రంగం పుంజుకుంటుందన్నారు.
ప్రపంచంలోని 10 శాతం బొగ్గు మన దేశంలో ఉందని, కావాల్సినంత డిమాండ్‌ కూడా ఉందన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి లేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, గ్రామాల్లో అయితే అసలు కరెంటే ఉండని దుస్థితి ఉందన్నారు. ఇలాంటి సమయంలో కూడా బొగ్గు నిల్వలను విడుదల చేయకుండా ప్రధాని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. మన దేశంలో 500 మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేస్తుంటే మరో 100 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని సోమయాజులు వివరించారు. తద్వారా విదేశీ మారక ద్రవ్యం కోల్పోవడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రభుత్వ నిర్ణయం కారణంగా పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

1956 నుంచి 94 వరకూ చూస్తే మన రాష్ట్రం ఆస్తులు అప్పుల నిష్పత్తి  101:100గా ఉండేదని సోమయాజులు చెప్పారు. వంద అప్పులు తీసుకువస్తే మన రెవెన్యూలో కొద్దిగా మిగులు చూపించి ఆస్తులు పెంచగలిగామన్నారు. అదే చంద్రబాబు కాలంలో అప్పటి రెవెన్యూ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీకి ఇచ్చిన డాక్యుమెంటు ప్రకారం 43: 100కు పడిపోయిందన్నారు. చంద్రబాబు హయాంలో తెచ్చిన అప్పులను రెవెన్యూ లోటుకు ఖర్చు పెట్టేశారన్నారు. ఆస్తుల రూపకల్పన చేయలేకపోయారన్నారు. దీనితో రెవెన్యూ లేకపోయారని, తద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేకపోయారన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి‌ ప్రభుత్వం వచ్చాక 2004 - 09 మధ్య ఆస్తులు అప్పుల నిష్పత్తి 130: 100కు పెంచారన్నారు. వచ్చిన ప్రతి రూపాయిని మూలధన ఆస్తులను పెంచే రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మిగులు నిధులను సమకూర్చడం ద్వారా ఇది సాధ్యమైందరన్నారు.

దేశంలో ఆర్థిక వృద్ధి పెరగాలంటే పెట్టుబడులు పెరగాలని సోమయాజులు చెప్పారు. ప్రభుత్వం ఒక రూపాయి పెడితే ప్రైవేటు రంగం నాలుగు రూపాయలు పెట్టేందుకు ముందుకు వస్తుందన్నారు. అలా చేయకపోవడం వల్లే 1991లో మన దేశం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితిని ఎదుర్కొందని సోమయాజులు గుర్తుచేశారు. యుపిఎ -2 ప్రభుత్వ విధానాల కారణంగా ఇప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ అంతకన్నా దుర్భర పరిస్థితుల్లోకి దిగజారిపోయిందని ప్రధాని చెప్పిన విషయాన్ని సోమయాజులు ఉటంకించారు.
దేశం మొత్తం ధాన్యం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లలో 90 శాతం జరుగుతోందని సోమయాజులు వివరించారు. అయితే, గ్రామాల్లో 80 శాతం మందికి సంబంధించిన వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగంపట్ల చిన్నచూపు చూడడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రైతులకు చేయూతనివ్వకుండా అన్యాయం చేసిందన్నారు.

మహిళలకు పార్లమెంటులో ఇవ్వాల్సిన 33శాతం రిజర్వేషన్‌ ఇవ్వని ఈ ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా బ్యాంకు పెడుతున్నట్లు చెప్పడంలోని ఔచిత్యాన్ని సోమయాజులు ప్రశ్నించారు. కొత్తగా ఇల్లు తీసుకునే వారికి లక్ష రూపాయల పన్ను రాయితీ ఇస్తామనడాన్ని ఆహ్వానించారు. ఐదు లక్షల వరకూ ఆదాయం ఉండే వారికి రెండువేల రూపాయలు వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారన్నారు.

పెట్రోల్‌పై ఇచ్చే రూ. 40 నుంచి 50 వేల కోట్ల సబ్సిడీని, ఎరువుల మీద ఇచ్చే మరో రూ. 40 నుంచి 50 వేల కోట్లను బడ్జెట్‌లో చూపించని వైనాన్ని సోమయాజులు ఉటంకించారు. ఈ లక్ష కోట్లను కూడా కలుపుకుంటే బడ్జెట్‌ లోటు మరింత ఎక్కువ అవుతుందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి యుపిఎ - 2 ప్రభుత్వం వైఫల్యం వల్లే మనకు దుస్థితి వచ్చిపడిందని సోమయాజులు వ్యాఖ్యానించారు.

తాజా ఫోటోలు

Back to Top