కడ వరకూ జగన్‌ వెంటే ఉంటా: రెహ్మాన్

‌హైదరాబాద్, 2 మే 2013: కొన్ని చానళ్ళు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం కన్వీనర్‌ హెచ్‌ఎ రెహ్మాన్‌ ఖండించారు. పార్టీ పట్ల తాను అసంతృప్తిగా ఉన్నాననటం అవాస్తవమని అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్ల నియామకంలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, రెహ్మాన్‌ పార్టీని వీడుతున్నారంటూ గురువారం కొన్ని చానళ్ళలో స్ర్కోలింగ్‌లు వచ్చిన వెంటనే ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రాణం ఉన్నంత వరకూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంటే తాను ఉంటానని ఆయన స్పష్టంచేశారు. ఆరోగ్యం సరిగా లేక పార్టీ కార్యక్రమాలకు కొద్దిరోజులు తాను దూరంగా ఉన్నానని వివరించారు. ముస్లిం మైనార్టీలకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే న్యాయం చేయగరన్న విశ్వాసం తనకు ఉందని ఆయన తెలిపారు.

ఇలాంటి దుష్ప్రచారం చేయడం మానుకోవాలని యెల్లో మీడియాకు రెహ్మాన్‌ విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ ఉందన్నారు. న్యూస్‌కు వ్యూస్‌కు తేడా ‌తెలుసుకోకుండా స్క్రోలింగ్‌లు వేయడం సరికాదని రెహ్మాన్ హితవు పలికారు. తనకు గాని, తన సామాజికవర్గానికి గాని అన్యాయం జరిగితే మీడియా ముందుకు వచ్చి తాను మాట్లాడతానన్నారు. అన్ని వర్గాల వారూ మంచిగా ఉంటేనే తామూ మంచిగా ఉంటామన్నారు.
Back to Top