కడప డిసిసిబి చైర్మన్ ఎన్నిక 28కి వాయిదా

కడప‌, 21 ఫిబ్రవరి 2013: కడప డిసిసిబి ఛైర్మన్, వై‌స్ ఛైర్మ‌న్ల ఎన్నికపై హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా డిసిసిబి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. శాంతి భద్రతల సమస్యను ‌కారణంగా చూపించి జిల్లా కలెక్టర్ ఈ ఎన్నికను ఈ నెల 28కి వాయిదా వేశారు. గురువారం తెల్లవారు‌ జామున జిల్లా కలెక్టర్ ఈ మేరకు ప్రకటన జారీ చేయడం గమనార్హం. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చిన వారు మెజారిటీ స్థానాల్లో గెలిచారు. దీనితో‌ డిసిసిబి చైర్మన్‌గా పార్టీ బలపరిచిన ఈ. తిరుపాల్‌రెడ్డి ఎన్నికవడం ఖాయమని తేలింది. అయితే, కడప డిసిసిబి చైర్మన్‌ పదవిలో తన కుమారుడిని బరిలో పెట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అడ్డగోలుగా అల్లర్లు సృష్టిస్తున్నారు.

నిజానికి ఈ ఎన్నిక మంగళవారంనాడే జరగాల్సి ఉంది. ఆ రోజున‌‌ జరగాల్సిన డిసిసిబి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ ఎన్నిక  సమావేశానికి కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరయ్యారు. దీనితో కోరం లేదని అధికారులు వాయిదా వేశారు. మరుసటి రోజు అంటే బుధవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నిక నిర్వహించాల్సిన డిసిఒ చంద్రశేఖర్‌ను కిడ్నాప్‌ చేసి, రాత్రంతా తిప్పి చివరికి చిత్తూరు జిల్లా మొలకలచెరువలో ఉదయం విడిచిపెట్టారు. చైర్మన్‌ ఎన్నిక కోసం ఉదయాన్నే డిసిసిబి వద్దకు చేరుకున్న‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చైర్మన్‌ అభ్యర్థి, ఆయన మద్దతుదారులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సే, మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డిలకు తీవ్ర నిరాశ ఎదురైంది. మధ్యాహ్నం వరకూ ఎన్నికల అధికారి లేకపోవడంతో పార్టీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వైయస్‌ఆర్‌సిపి నాయకులు ఫిర్యాదుపై కలెక్టర్‌ స్పందిస్తూ, సుబ్బయ్య అనే అధికారిని ఎన్నికలు నిర్వహించేందుకు నియమించినట్లు, గురువారం ఉదయం యధావిధిగా ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే, గురువారం ఈ ఎన్నిక నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలూ ఉన్నా... అధికారులు కుంటిసాకులు చెబుతుండడం గమనార్హం. కలెక్టర్‌ చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోలేదు. శాంతి భద్రతల కారణాలు చూపుతూ డిసిసిబి ఛైర్మన్, వై‌స్ ఛైర్మ‌న్ ఎన్నికను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా, గురువారం ఎన్నిక జరుగుతుందని డిసిసిబి కార్యాలయం దగ్గరకు ఉదయమే వచ్చిన వైయస్‌సిపి మద్దతుదారులు వాయిదా ప్రకటనతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే‌ వీరశివారెడ్డి కుట్ర అని వారు నిప్పులు చెరుగుతున్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పలు డిసిసిబిలను చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ తనకు మెజారిటీ లేకపోయినా కడప‌ డిసిసిబి చైర్మన్ పదవిని కూడా అడ్డదారుల్లో దక్కించుకోవాలని చూస్తోందని వారు దుయ్యబట్టారు.

మరో పక్కన డిసిసిబి చైర్మన్ ఎన్నిక తక్షణమే‌ నిర్వహించాలంటూ బుధవారం ఉదయం నుంచీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అకేపాటి అమరనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ నారాయణ, మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు తదితరులు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేస్తున్న సమయంలో వీరశివారెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చి అసభ్య పదజాలంతో దూషించి, చూసుకుందాం రమ్మంటూ సవాల్‌ చేసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వైయస్‌ఆర్‌పి నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించారు.
Back to Top