'కాంగ్రెస్‌, టిడిపి నాయకుల తీరు సరికాదు'

అనంతపురం :

 సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడు‌తోందని వైయస్‌ఆర్‌సిపి జిల్లా అడ్‌హా‌క్ కమిటీ కన్వీన‌ర్ శంకరనారాయణ ఆరోపించారు. ‌అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన, ధర్మవరం నాయకుడు తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు గిర్రాజు నగేశ్‌లతో కలసి మాట్లాడారు.‌


ధర్మవరంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి దౌర్జన్యకాండ సృష్టిస్తున్నారని ఆరోపించారు. సహకార ఎన్నికల్లో డెరైక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన రామకృష్ణారెడ్డిని కిడ్నా‌ప్ చేశారన్నారు. న్యాయాన్ని కాపాడాల్సిన ‌డిఎస్పీ, సిఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఎస్పీ తక్షణమే చొరవ తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

దౌర్జన్యాలు చేస్తే జ‌నం ఆదరిస్తారా?:
సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్, ‌టిడిపిలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే దొడ్డిదారిన ఎన్నికవ్వాలని చూస్తున్నాయని వైయస్‌ఆర్‌సిపి జిల్లా ముఖ్య నాయకులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. దౌర్జన్యాలకు దిగడం ద్వారా వారు ప్రజల మన్ననలు పొందడం కల్ల అని వారు హెచ్చరించారు. ప్రకాష్‌రెడ్డి నివాసంలో ‌శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే చోట అత్యుత్సాహం ప్రదర్శించి సొసైటీ ఎన్నికలు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే ఊరుకునేది లేదని, ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. సహకార సంఘం ఎన్నికల్లో 60 నుంచి 70 సొసైటీల్లో వైయస్‌ఆర్‌సిపి మద్దతిచ్చిన వారే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top