<strong>హైదరాబాద్, 18 మార్చి 2013:</strong> రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిలు ఒకే ఎజెండాతో రాజకీయాలు చేస్తున్నాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. టిడిసి - కాంగ్రెస్ పార్టీ ఒక్కటైపోయాయని కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వానికి కొమ్ము కాస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భూమన కరుణాకరరెడ్డి సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేకంగా మారిపోయిన ఆ రెండు పార్టీలూ కలిసిపోయి తెలుగు కాంగ్రెస్‌గా ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అధికార పార్టీకి ప్రతిపక్షం కొమ్ముకాయడం సిగ్గుచేటు అన్నారు.<br/>వ్యక్తిగత ప్రయోజనాలకే టిడిపి ప్రాధాన్యత ఇచ్చిందని, సహకార, ఎమ్మెల్సీ, ఎఫ్‌డిఐలపై కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో ప్రతి 200 కిలోమీటర్లకు ఒక నాయకుడు ఆ పార్టీ విడిచిపెడుతున్నారని భూమన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా భూమన తెలుగు - కాంగ్రెస్ కండువాలను మీడియాకు ప్రదర్శించారు.