'కాంగ్రెస్‌ ప్రభుత్వానిది దారుణ రాజకీయ క్రీడ'

హైదరాబాద్‌, 15 జనవరి 2013: కాంగ్రెస్‌ ప్రభుత్వం దారుణమైన రాజకీయ క్రీడ ఆడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు. తనకు నచ్చని, ఇష్టంలేని వారిని ఎలా నిర్బంధించవచ్చో ఒక ఉదాహరణగా చూపించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని అప్రజాస్వామికంగా జైలులో పెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా మానవహక్కులను ఉల్లంఘించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఎనిమిది నెలలుగా నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో తాము కోటి సంతకాలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ రెండు కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రీ జగన్‌ను అక్రమంగా నిర్బంధించడాన్ని తమ సంతకం ద్వారా వ్యతిరేకించారని ఆయన తెలిపారు. రాజ్యాంగ రక్షకుడైన రాష్ట్రపతికి ఈ సంతకాలను అందజేయడంతో పాటు ప్రభుత్వం దమననీతిని ఆయనకు వివరంగా చెబుతామన్నారు.

జగన్‌ కోసం.. జనం సంతకాలను రాష్ట్రపతికి అందజేసేందుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో ఢిల్లీకి బయలుదేరడానికి ముందు జూపూడి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దారుణమైన రాజకీయ క్రీడను తాము సహించబోమని రెండు కోట్ల మంది ప్రజలు సంతకాలు చేశారన్నారు. తాము అపాయింట్‌ కోరిన వెంటనే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలిపారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా శ్రీ జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జనం చేసిన సంతకాలను రాష్ట్రపతికి ఈ రోజు అందజేస్తామన్నారు. వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నాయకత్వంలో పార్టీ ముఖ్య నాయకులు డిఎ సోమయాజులు, డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సహా అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు రాష్ట్రపతిని కలిసేందుకు వెళుతున్నట్లు జూపూడి వివరించారు.

Back to Top