కాంగ్రెస్ పాలనలో బతుకు భారం


తుర్కయాంజాల్, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులు భారమయ్యాయని దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల వల్ల పప్పు దినుసులు, చెక్కెర, మంచినూనె వంటి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటాయని మండి పడ్డారు. పన్నులు, కరెంటు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ గేటు వద్ద మహిళలతో శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సతీమణి శ్రీమతి వైయస్ భారతి కూడా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.

     రచ్చబండ కార్యక్రమానికి హాజరైన మహిళలు స్థానిక సమస్యలను ఏకరువు పెట్టారు. పింఛన్లు సరిగా ఇవ్వడంలేదని, ఇచ్చిన పింఛను సరిపోవడంలేదన్నారు. ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బల్బు  ఉన్న ఇంటికి 5 వేల వరకు కరెంటు బిల్లు వస్తోందన్నారు. మహానేత ఉన్న సమయంలో కేవలం వంద రూపాయల లోపు వచ్చేదన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పావలా వడ్డీ రుణాలు ఇచ్చేవారని, ఇప్పుడు రుణాలు ఇవ్వకపోగా ఇచ్చిన రుణాలకు రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నారని శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు.

     ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల స్థానికులనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సామాన్యులు బతకడం గగనమైపోతోందని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను వెయ్యి రూపాలకు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. సమయం వచ్చినపుడు ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని, రాజన్న రాజ్యం వస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మళ్లీ మంచి రోజులు వస్తాయని, ప్రజల కష్టాలు తీరుస్తారని భరోసా ఇచ్చారు. ప్రజలు జగనన్నకు అండగా నిలవాలని  శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

     జగనన్న ముఖ్యమంత్రి అయితే వితంతువు, వృద్ధాప్య పింఛన్లు రూ.700 వరకు పెంచుతారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోఉన్నప్పుడు కేవలం 70 రూపాయలు చొప్పున 16 లక్షల మందికి మాత్రమే పింఛను ఇచ్చేవారన్నారు.  మహానేత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పింఛను మొత్తాన్ని 200 రూపాయలకు పెంచారన్నారు. 16 లక్షలు ఉన్న లబ్దిదారుల సంఖ్యను 71 లక్షలకు పెంచిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. వికలాంగుల పింఛన్లు కూడా 500 రూపాయల వరకు పెంచారని గుర్తు చేశారు.

     మోకాలి గాయానికి శస్త్ర చికిత్స అనంతరం శ్రీమతి షర్మిల బుధవారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ సమీపంలోని ఎస్ఎస్ఆర్ గార్డెన్స్ నుంచి తన పాదయాత్రను పునఃప్రారంభించారు. తుర్కయాంజాల్, రాగన్నగూడెం, బొంగులూరు గేటు, మాన్‌సాన్ పల్లి గేటు, శేరిగూడెం మీదుగా ఇబ్రహీంపట్నం వరకు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. బుధవారం నాడు శ్రీమతి షర్మిల 15.5 కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది తరలి వచ్చారు.

Back to Top