కాంగ్రెస్ పాలనలో అందరికీ కష్టాలు

కోవెలకుంట్ల:

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అన్ని వర్గాల ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పతనమవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి స్పష్టంచేశారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలంలోని గుండుపాపల సహకార సంఘ ఎన్నికల్లో ప్రచారానికి ఆమె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్తు, బస్సు, రైలు చార్జీలు.. పెట్రోల్, డీజల్, రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెంచి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెనుభారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదనీ, ఐదేళ్ల కాలంలో ఏనాడూ ఆయన ప్రజలపై భారం మోపలేదనీ పేర్కొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారనీ, ఆయన మరణానంతరం ప్రస్తుత పాలకులు రైతుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారనీ ఆరోపించారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం భయపడుతోందన్నారు. సొసైటీ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్నచోట అడ్డదారులు తొక్కి ఎన్నికల నిర్వహించకుండా స్టే తీసుకురావడం విచారకరమన్నారు. ఎన్నికలను ఎదుర్కోలేక నామినేషన్ల తర్వాత ఎన్నికలు వాయిదా వేయడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారన్నారు. సర్‌చార్జీల రూపంలో నిరుపేద కుటుంబాలు వేల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించలేక నరకం అనుభవిసున్నాయన్నారు. ఏ ఒక్క అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సహకార సొసైటీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాభవం తప్పదన్నారు. తమ పార్టీ అధినేత శ్రీ వైయస్  జగన్మోహన్‌రె డ్డిని ఎదుర్కోలేకే కుట్రపన్ని జైలులో పెట్టించారని ఆరోపించారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ చూడలేక, జగన్ సీఎం అవుతారని అన్ని సర్వేల్లో తేలడంతో కక్షసాధింపుగా ప్రజల మధ్యలేకుండా చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ముఖ్య నేతలు తమ పార్టీలో  చేరుతున్నారనీ, మరికొన్ని రోజుల్లో ఆ రెండు పార్టీలు ఖాళీకావడం ఖాయమనీ ఆమె  జోస్యం చెప్పారు.

Back to Top