కాంగ్రెస్‌కు బ్రాంచ్‌ కార్యాలయంగా మారిన టిడిపి

విజయవాడ, 3 ఫిబ్రవరి 2013: చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం టిడిపి తన బాధ్యతలను పూర్తిగా మరిచిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తొమ్మిది మంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించినట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ఆయన అన్నారు. అయినప్పటికీ అబద్ధాలను ప్రచారం చేస్తూ అధికార కాంగ్రెస్‌ పార్టీకి టిడిపి అండగా నిలబడుతోందని ఆయన దుయ్యబట్టారు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీకి టిడిపి బ్రాంచి కార్యాలయంగా మారిపోయిందని గట్టు ఎద్దేవా చేశారు. మైనార్టీలో పడిపోయిన ఈ ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే అన్ని పార్టీలూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసానికి మద్దతిచ్చేందుకు కాంగ్రెసేతర పార్టీలు ముందుకు వచ్చినా టిడిపి అవిశ్వాసం పెట్టడం లేదేమని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌, టిడిపిల మధ్య కుదిరిన రహస్య అవగాహన కారణంగానే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని గట్టు ఆరోపించారు.

Back to Top