'కాంగ్రెస్ చివరి సిఎం‌గా రికార్డులలోకి కిరణ్‌'

తిరుపతి, 16 ఫిబ్రవరి 2013:‌ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమా‌ర్ రెడ్డి ‌రికార్డులలోకి ఎక్కబోతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌కి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వద్ద రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు మోకరిల్లి అత్యంత నీచమైన స్థాయికి దిగజారారని ఆయన విమర్శించారు. ఇక ఎప్పటికీ కోలుకోలేని విధంగా‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తగిలిందన్నారు.

ప్రధాన శత్రువుగా పరిగణించాల్సిన టిడిపితో సహకార సంఘాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని భూమన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి తన సొంత జిల్లా చిత్తూరులో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. డిసిసిబి చైర్మన్ ఎన్నికలలో అక్రమాలు జరుగుతు‌న్నాయని కరుణాకరరెడ్డి చెప్పారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీకి చెందినవారిని డైరెక్టర్ పోస్టులకు నామినేష‌న్ వేయడానికి కూడా రాకుండా అడ్డుకున్నార‌ని ఆయన నిప్పులు చెరిగారు. ఎన్నికలు ఏకపక్షంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరును‌ చూస్తున్న ప్రజలు చీదరించుకుంటున్నారని, అసహ్యించుకుంటున్నారని భూమన తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు హిట్లర్కు, గోబె‌ల్సుకు వారసులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ డిసిసిబి చైర్మ‌న్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆ‌యన ప్రకటించారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని రాబోయే సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని సమూలంగా ‌సమాధి చేస్తుందని భూమన హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైయస్‌ఆర్‌సిపి వ్యవహరిస్తుందని అన్నారు.
Back to Top