కాకినాడలో ద్వారంపూడి ఒకరోజు నిరాహార దీక్ష

కాకినాడ, 28 మార్చి 2013:

టీడీపీ అధినేత చంద్రబాబుపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. వస్తున్నా మీకోసం పేరిట బాబు చేపట్టిన పాదయాత్రకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గురువారం ఒకరోజు నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబుకు పాదయాత్ర చేసే అర్హత లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీని తూర్పారపడుతున్న చంద్రబాబు ఆ ప్రభుత్వంతోనే కుమ్మక్కయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి సహకరిస్తూ పడిపోకుండా కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నానంటూ ఇప్పటికి ఆయన 2500 కిలోమీటర్లు నడిచారన్నారు. ప్రజల కోసమే ఉన్నానని చెబుతున్న చంద్రబాబు ఆయన జీవితంలో చాలా తప్పిదాలు చేశారని ధ్వజమెత్తారు. ఆయన రెండుమూడ్రోజుల్లో కాకినాడ రాబోతున్నారనీ, ఆయన చేస్తున్నది తప్పని తెలియజేయడానికే నిరాహార దీక్ష చేపట్టామని వివరించారు. కాకినాడలో ఆయనకు ప్రతిరోజూ ఏదో ఒకరూపంలో నిరసన తెలియజేస్తామని ద్వారంపూడి స్పష్టం చేశారు.

Back to Top