అంతిమ విజయం న్యాయం, ధర్మానిదే

  • వేరే పార్టీలోని ఎమ్మెల్యేల కొనుగోలుకే బాబు ప్రాధాన్యత
  • ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని టీడీపీ
  • రుణమాఫీ మాటే మరిచిపోయారు
  • రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, చివరకు పిల్లలను వదలని బాబు
  • కర్నూలులో వైయస్‌ జగన్‌ మూడో రోజు రైతు భరోసా యాత్ర
  • వేల్పనూరులో చంద్రబాబుపై వైయస్ జగన్ ధ్వజం
కర్నూలు: సీఎం చంద్రబాబు పాలనను గాలికి వదిలి, వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఎక్కడైనా న్యాయం, ధర్మానిదే అంతిమ విజయమని చెప్పారు. కర్నూలు జిల్లాలో వైయస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర మూడో రోజు వేల్పనూరు గ్రామం నుంచి శనివారం ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని అంకాలమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. వేల్పనూరు గ్రామానికి ఒక విశిష్టత ఉందని వైయస్‌ జగన్‌ అన్నారు. బుడ్డా రాజశేఖరరెడ్డిని వైయస్సార్సీపీ తరపున మీరంతా  ఆశీర్వదించి గెలిపించారని, అయితే ప్రలోభాలతో చంద్రబాబు పబ్బం గడుపుతున్నారని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. వేరే పార్టీలోని ఎమ్మెల్యేలను కొనుగోలుకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. 

బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తామని బాబు హామీ ఇచ్చి మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. రుణ మాఫీ హామీని చివరకు మరిచిపోయారని మండిపడ్డారు.చదువుకుంటున్న పిల్లలను కూడా వదల్లేదని విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని ఆనాడు చెప్పారన్నారు. బాబుకు సీఎం జాబు వచ్చింది కానీ..నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలు, ప్రలోభాలు ఏ స్థాయికి వెళ్లాయంటే చివరకు బుడ్డా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారని ఆరోపించారు. మహాభారతం, ఖురాన్, బైబిల్‌ చదువుతామని, ఏదైనా కూడా చెప్పేది ఒక్కటే అని వైయస్‌ జగన్‌ అన్నారు. చివరకు అబద్ధాలు చెప్పే వాళ్లు, మోసాలు చేసేవారు పూర్తిగా బంగాళ ఖాతంలో కలిసిపోతారని హెచ్చరించారు. న్యాయం, ధర్మమే చివరకు గెలుస్తుందని చెప్పారు. మళ్లీ అదే జరుగబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకు మనం చూసిన సినిమా కూడా ఇంటర్వేల్‌ వరకే జరిగిందని తెలిపారు. సినిమాలో 14 రీళ్లు ఉంటే 13వ రీల్‌ వరకు విలన్‌దే పైచెయ్యిగా కనిపిస్తుందని చెప్పారు. కానీ, ఆ చివరి ఒక్క రీల్‌లో కథ అడ్డం తిరుగుతుందని, దేవుడు పై నుంచి ఆశీర్వదిస్తాడని, ఆ తరువాత  హీరో విలన్‌ను చావ బాదుడు బాదుతాడని పేర్కొన్నారు. సినిమా లాగానే ఏ కథ అయినా కూడా చివరకు ముగింపు ఇదేనని వైయస్‌ జగన్‌ వివరించారు.

బుడ్డా కుటుంబంలో బాబు చిచ్చు
బాబు తన స్వార్థం కోసం స్వర్గీయ మాజీ మంత్రి బుడ్డా వెంగళ్‌రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆరోపించారు. బుడ్డా కుటుంబం మీద తనకు నమ్మకం ఉందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కుటుంబంలో ఒక్కరు తప్పు చేసినా క్షమించే మంచి హృదయం దేవుడు మన అందరికీ ఇచ్చారని తెలిపారు. మళ్లీ ఆ కుటుంబం మీద అందరూ ఆదరాభిమానాలు చూపాలని, బుడ్డా శేషారెడ్డిని ఆశీర్వదించాలని వైయస్‌ జగన్‌ సూచించారు. బుడ్డా శేషారెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top