ఒక్కటవుతున్న రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలు

హైదరాబాద్:

ద్వంద్వ వైఖరితో రాష్ట్ర విభజనకు సహకరించిన టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పుడు ఒక్కటైపోతున్నాయని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్సీ‌, అధికారప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నాలుగున్నర ఏళ్లుగా కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత ఆ ముసుగును తీసేశాయని, ఒక్కటిగా కలిసిపోతున్నాయని విమర్శించారు. టీడీపీలో కాంగ్రెస్‌ పార్టీ విలీనం కావడానికి సిద్ధపడుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న టీడీపీ ‘పిల్ల టీడీపీ కాంగ్రెసో, తల్లి టీడీపీ కాంగ్రెసో’ చంద్రబాబే స్పష్టంచేయాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారంనాడు జూపూడి మీడియా సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్ ‌నాయకులను టీడీపీలోకి తీసుకోవడం కోసం చంద్రబాబు వారి పార్టీ కార్యకర్తలకు చేసిన హితోపదేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై జూపూడి ప్రభాకర్‌రావు మీడియాకు ప్రదర్శించారు. ‘ఇది చరిత్రాత్మకమైన సమయం. కాంగ్రెస్ వాళ్లు ఎంత మంది వస్తే అంతమందిని కలుపుకోండి. గ్రామస్థాయితో పాటు ఎక్కడికక్కడ కలుపుకుంటే పార్టీ బలపడుతోంది. ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నేను హైదరాబా‌ద్ ‌స్ధాయిలో ఆలోచన చేస్తున్నా. త్వరలో పార్టీలోకి చేర్చుకునే వారిని మీరు పేపర్లో చూస్తారు’ అంటూ కార్యకర్తలను హైదరాబాద్‌కు పిలిచి కాంగ్రెస్‌తో చెలిమి చేయడం, వారిని కలుపుకోవడానికి గల కారణాలను చంద్రబాబు వివరిస్తూ ఉపోద్ఘాతం చేశారని దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించబోరని జూపూడి చెప్పారు. 2009 ఎన్నికల్లో కూడా మహాకూటమిని ఏర్పాటు చేసినా ప్రజలు చంద్రబాబును ఓడించారన్నారు. అవిశ్వాసం సందర్భంగా వచ్చిన 18 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేసినా ప్రజామోదంతో వైయస్ఆర్‌సీపీ 15 స్థానాలను కైవసం చేసుకుందన్నారు. దీంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే వాటి ఫలితాలు ప్రకటించ‌ వద్దంటున్నారని విమర్శించారు. తెలంగాణకు, సీమాంధ్రకు చంద్రబాబు తీరని ద్రోహం తలపెట్టారని జూపూడి మండిపడ్డారు.

- సింగపూర్‌తో చంద్రబాబుకు విడదీయరాని బంధం ఉంది. కుటుంబంతో పాటు వ్యక్తిగత పనుల మీద ఆయన ఇప్పటి వరకు దాదాపు 200సార్లు వెళ్లివచ్చి ఉంటారు.
- సింగపూర్ అంటూ సీమాంధ్రలో వ్యవసాయం లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారా? రైతుల భూములన్నింటినీ లాక్కుంటారా?

‌ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణాన్ని కాంట్రాక్టుకు ఇచ్చినందుకు పార్టీ కార్యాలయాన్ని, హెరిటే‌జ్ కార్యాలయాన్ని ఉచితంగా నిర్మించుకున్న విషయం ప్రజలకు గుర్తుంది.
-‌ చంద్రబాబు మాటలన్నీ నీటి మూటలే. ఆయనే గనుక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే రెండుసార్లు ఎందుకు ఓడిపోయారు. చంద్రబాబువన్నీ మాయమాటలు, నయవంచన. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు.

- కేంద్ర మంత్రి పురందేశ్వరికి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే అర్హతలేదు. చంద్రబాబు వెంట ఉండి తండ్రి ఎన్టీఆ‌ర్‌కు వెన్నుపోటు పొడిపించిన పురందేశ్వరి, ఇప్పుడు రాష్ట్ర విభజన జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ పంచన చేరారు.

- పురందేశ్వరి అధికార దాహం కోసం ప్రతీ పదేళ్లకు ఒకసారి పార్టీలు మారే సంప్రదాయముంది. ఆమెకు తండ్రి ఆత్మగౌవరమే కాదు తెలుగుప్రజల ఆత్మగౌరవం కూడా పట్టదని జూపూడి విమర్శించారు.

Back to Top