తెలంగాణ వైయస్సార్సీపీలో భారీ చేరికలు

హైదరాబాద్ః తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికీ గట్టు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ...రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలపర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విభేధాలు పక్కనబెట్టి పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. 

గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడ రాలేదని గట్టు అన్నారు. సమైక్య నినాదం ఉన్న సమయంలో తెలంగాణలో వైయస్సార్సీపీ ఓ ఎంపీ,  3 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుందని చెప్పారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఒక్కరూ పార్టీని గెలిపించుకునేందుకు శ్రమించాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.  బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ప్రజానీకానికి  వైయస్ కుటుంబంపై ఎనలేని అభిమానం ఉందని గట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైయస్సార్సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త జగనన్న సైనికులై  పోరాడాలన్నారు. తన నుంచి పార్టీ శ్రేణులకు పూర్తి సహకారం ఉంటుందని, జగనన్న ఆశీస్సులుంటాయని భరోసానిచ్చారు. 
Back to Top