జ్ఞానభేరి పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

నెల్లూరు: జ్ఞానభేరిల పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో సమావేశాలు నిర్వహిస్తూ మరోసారి విద్యార్థులను, యువతను మోసం చేయడానికి పూనుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క యూనివర్సిటీ కూడా స్థాపించలేదన్నారు. నెల్లూరు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పుకొని ఈ రోజు ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రూ. 2 వేలని ప్రకటించి రూ. వెయ్యి ఇవ్వడం ఏంటని నిలదీశారు. రాష్ట్రంలో దాదాపు 1.7 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే వారిలో పదిశాతం మందికి కూడా రూ. వెయ్యి భృతి ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగ భృతిలో చంద్రబాబు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి చంద్రబాబు బలికాక తప్పదన్నారు
Back to Top