జీఓలు సక్రమమైతే.. క్విడ్ ప్రో కో ఎక్కడ?

న్యూఢిల్లీ : వివాదాస్పదమైన ఆ 26 జీఓలు సక్రమమే అయితే.. తమ పార్టీ అధినేత శ్రీ వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి క్విడ్‌ ప్రో కో కు పాల్పడినట్లు ఎలా అవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిలదీశారు. ఆ జీఓలతో సంబంధం ఉన్న మంత్రులు, అధికారులు అవి సక్రమమే అని సుప్రీం కోర్టుకు తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ జీఓలలో ప్రమేయం ఉందన్న అభియోగంతో శ్రీ జగన్‌ను అరెస్టు చేసి సుమారు ఎనిమిది నెలలుగా ఆయనను అక్రమంగా జైలులో నిర్బంధించారని మేకపాటి విమర్శించారు. అసలు అక్కడ క్విడ్ ప్రో కోకు అవకాశం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో సేకరించిన సంతకాల పత్రాల సిడిలను మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందజేసిన అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో సభ్యుల బృందం రాష్ట్రపతిని కలుసుకున్నారు.

‌రాజ్యాంగ పెద్దగా తాము వివరించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని తాము కోరామని మేకపాటి తెలిపారు. తమ విజ్ఞప్తిపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. వైయస్‌ఆర్‌సిపిని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తారనే వార్తలు వస్తున్నాయని మీడియా ప్రశ్నించగా ‘మేమెందుకు పార్టీని విలీనం చేస్తాం? ప్రజలు మా పక్షానే ఉన్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో స్పష్టమైంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 30కి పైగా పార్లమెంట్ స్థానాలు, 230కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. విలీనం అన్న మాటకు తావులేదు’ అని ఆయన స్పష్టంచేశారు.‌

అంతకు ముందు, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై సిబిఐని అడ్డం పెట్టుకొని సాగిస్తున్న కుట్రలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి పార్టీ ప్రతినిధి బృందం తీసుకె‌ళ్ళింది. ఈ బృందానికి పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వం వహించారు. ఈ బృందంలో విజయమ్మతో పాటు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ సీఈసీ సభ్యుడు కోన రఘుపతి ఉన్నారు.

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చేపట్టిన ‘జగన్ కోసం - జనం సంతకం’ ఉద్యమంలో‌ సుమారు రెండు కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని శ్రీ జగన్ అక్రమ అరె‌స్టును నిరసిస్తూ తమ సంతకాలు చేశారు. జనం కోర్టులో శ్రీ జగన్ నిర్దోషి అని తీర్పు‌ చెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top