పేదల బతుకులపై జన్మభూమి కమిటీల పెత్తనం

నల్లపాళేం(పొదలకూరు) : పేదల బతుకులపై జన్మభూమి కమిటీల పెత్తనం వల్ల అర్హులైన వారికి ఇళ్లు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందడం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని తాటిపర్తి పంచాయతీ నల్లపాళేం దళితవాడలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన ఇళ్లను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించి బాధితులకు దుస్తులు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైస్‌ రాజశేఖర్‌రెడ్డి మరో ఐదేళ్లు సీఎంగా ఉండిఉంటే రాష్ట్రంలో పూరిగుడిశె అన్నది లేకుండా చేసేవారన్నారు. ఆయన హయాంలో 47 లక్షల ఇళ్లను నిర్మించి రికార్డు సృష్టించినట్టు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్చి ఉన్నవారికి, తెలుగు తమ్ముళ్లకు మాత్రమే పక్కా ఇళ్లను పంపిణీ చేస్తూ పేదల కడుపు కొడుతున్నట్టు విమర్శించారు. 4 లక్షల ఇళ్లను నిర్మిస్తానని అతీగతీ లేదన్నారు. అర్హులకు ఇళ్లు ఇచ్చి ఉంటే నల్లపాళేంలో దళితుల ఇళ్లు అగ్ని ఆహుతి అయిఉండేవి కాదన్నారు. పక్కా ఇళ్లకు రూ.3 లక్షల నుంచి రకరకాలుగా ని«ధుల కేటాయింపును మార్చి చివరకు రూ.70 వేలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, రూ.80 వేల మేరకు లబ్ధిదారుడు కూలీ చేసుకోవాలని సూచించడం ఎంతవరకు సమంజసం అన్నారు. బాబు మూడేళ్ల పాలనలో హామీలు, మాటలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నట్టు తెలిపారు. అరకొర ఇళ్లను మంజూరు చేస్తూ లక్షల ఇళ్లను ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నట్టు తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడినవారికి పదవులు ఇస్తూ గాడితప్పిన పాలన సాగిస్తున్నట్టు దుయ్యబట్టారు. రాష్ట్ర చిత్రపటం నుంచి చంద్రబాబును తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నల్లపాళేం అగ్నిప్రమాద బాధితులకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఇళ్లను మంజూరు చేయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, జిల్లా యువజన ప్రధానకార్యదర్శి పీ.అశోక్‌కుమార్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు పామూరు లచ్చారెడ్డి, పలుకూరు పోలిరెడ్డి, వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, పార్లపల్లి శ్రీనివాసులురెడ్డి, నంది శ్రీనివాసులురెడ్డి, హౌసింగ్, ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసులురెడ్డి, ప్రతాప్‌ తదితరులు ఉన్నారు

Back to Top