జన్మభూమికమిటీలు రద్దుచేయండి

  • చంద్రబాబులో మార్పు రావాలి
  • దళితులు, పేదల గురించి పట్టించుకోవాలి
  • బాబూ జగ్జీవన్ రామ్ జయంతి జరిపిన వైఎస్ జగన్
  • హైదరాబాద్: జన్మభూమి కమిటీలను రద్దుచేయాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పేదలు, దళితులు అందరికీ సమానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిని చేకూర్చాలని ఆయన సూచించారు. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం తాబేదార్లకే ప్రయోజనాలు చేకూర్చటం సరి కాదని ఆయన అభిప్రాయ పడ్డారు.

    దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ వేడుకలు వైఎస్సార్ జిల్లా వేంపల్లి లో నిర్వహించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల దండ వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు పట్టణం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన సేవల్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

          డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ లు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటు పడ్డారు. ఇవ్వాల్టికి కూడా వాళ్లు చేసిన పనుల్ని అంతా గుర్తు చేసుకొంటున్నాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో మాత్రం దళితులు, అణగారిన వర్గాలకు మనం తోడుగా ఉన్నామా లేదా అన్నది మాత్రం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఇదే విషయం మీద అసెంబ్లీలో చర్చ జరిగితే మాట్లాడటం జరిగింది. దళితులకు అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ చేసిన సేవల్ని గుర్తు చేసుకొంటున్నాం. కానీ, నేటి పాలకులు ఏ విధంగా విస్మరిస్తున్నారు అనేది మాత్రం వదిలేస్తున్నారు. ఇది సరికాదు.

          జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిధులు అందాలి. సబ్ ప్లాన్ అన్నది రాజ్యాంగం ప్రకారం అందిన హక్కు. అందులో ప్రణాళికా వ్యయం నుంచి జనాభా ప్రాతిపదికన నిధులు అందాల్సి ఉంది. కానీ ఆ నిధులు ఇవ్వకుండా దళితులకు అన్యాయం చేస్తున్నారు. ఒక్క సబ్ ప్లాన్ విషయమే కాదు, అనేక రకాలుగా అన్యాయం చేస్తున్నారు. గిరిజనులకు గిరిజన సలహా మండలి నియమించాల్సి ఉంది. అందులో మూడో వంతు మంది ఎమ్మెల్యేలు ఉండాలి. వాస్తవంగా రాష్ట్రంలో అత్యధిక గిరిజన ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ వారు. అందుకే రెండేళ్లుగా గిరిజన సలహా మండలిని నియమించటం లేదు.

          చంద్రబాబు మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. పుట్టుకతోనే ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకొంటారా అని వ్యాఖ్యానించిన మనిషి ఆయన. ఈ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న మనుషులకు జ్జానోదయం కలగాలి. ఇటువంటి వాళ్లను చూసి మహాకవి గురజాడ వందేళ్ల కిందట ఒక కవిత రాశారు. ‘‘ ఎంచి చూడగా మనుజులందు మంచి, చెడ్డలు రెండే కులములు.. మంచి అన్నది మాల అయితే, ఆ మాల నేనౌతా ’’ అని రాయటం జరిగింది. అంటే మంచి అన్నది మాల మాదిగలు అని గుర్తించుకోవాలి. ఆ మాల నేనౌతా అన్న సంకేతం పంపించాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాత్రం కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మనిషి మారాలి అని మనమంతా కోరుకొందాం. అంతా కలిసికట్టుగా ఒకటవుదాం. మార్పు ఎందుకు రావాలో కూడా చెబుతాను.

          రాష్ట్రంలోని జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి. ఎందుకంటే గెలిచిన సర్పంచ్ లకు విలువ లేకుండా పోయింది. గెలిచిన సర్పంచ్ సంతకానికి, మాటకు విలువ లేదు. నలుగురు తెలుగుదేశం కార్యకర్తల చేతిలో అధికారం ఉంది. ఆ నలుగురు సంతకం పెడితేనే పింఛన్ ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఏ పనికి అయినా ఆ కమిటీ దే పెత్తనం. ఇంతటి దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ కనిపించదు. పేదలకు మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు. రాజకీయాలతో సంబంధం లేదు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి కావాలి. అటువంటి నాయకత్వం కావాలి. అందుకే చంద్రబాబులో మార్పు రావాలి. మనమంతా కలిసికట్టుగా పోరాటం చేద్దాం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.

    ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Back to Top